Aashirwad Sooryavanshi: మరో సూర్యవంశీ వస్తున్నాడండోయ్.. తొలి శతకాన్ని నమోదు చేసిన ఆశీర్వాద్ సూర్యవంశీ..

Sooryavanshi

Sooryavanshi

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులోనే ఐపీఎల్ ఆడి, సంచలనాలు సృష్టిస్తున్న 15 ఏళ్ల వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ తాజాగా క్రికెట్ ప్రపంచంలో వార్తల్లో నిలిచాడు. సమస్తీపూర్‌లో జరిగిన ఒక స్థానిక ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆశీర్వాద్ సంచలన బ్యాటింగ్‌తో తన కెరీర్‌లో మొదటి సెంచరీని నమోదు చేశాడు. అన్న వైభవ్ లాగే తమ్ముడు కూడా పరుగుల వరద పారించడంతో క్రికెట్ అభిమానుల దృష్టి ఇప్పుడు ఇతనిపై పడింది.

83 బంతుల్లో 103 పరుగులు..
సాధారణంగా వైభవ్ సూర్యవంశీ తన దూకుడు ఆటతీరుకు పేరుగాంచగా, తమ్ముడు ఆశీర్వాద్ మాత్రం చాలా సంయమనంతో, పరిణతి చెందిన బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో అతను కేవలం 83 బంతుల్లోనే 103 పరుగులు చేసి అద్భుత శతకాన్ని అందుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. చివరికి ప్రశాంత్ రాజ్ బౌలింగ్‌లో ఆయుష్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఆశీర్వాద్ అవుట్ అయ్యాడు.

×
×
Ad

గర్వపడుతున్న కుటుంబం..
ఆశీర్వాద్ సాధించిన ఈ తొలి శతకంపై అతని అన్నయ్య ఉజ్వల్ సూర్యవంశీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్కోర్‌కార్డ్ ఫోటోను పంచుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అలాగే వారి తండ్రి సంజీవ్ సూర్యవంశీ కూడా ఫేస్‌బుక్ వేదికగా స్పందిస్తూ.. “నా చిన్న కుమారుడు ఈరోజు ప్రాక్టీస్ మ్యాచ్‌లో తన మొదటి సెంచరీ చేశాడు. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు అతనిపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను” అని పోస్ట్ చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంజీవ్ మాట్లాడుతూ.. తన చిన్న కొడుకును కూడా రాబోయే రెండేళ్లలో వైభవ్ లాగే అగ్రశ్రేణి క్రికెటర్‌గా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు. ఆ మాట అన్న కొద్ది రోజులకే ఆశీర్వాద్ ఈ ఘనత సాధించడం విశేషం.

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్‌లో అదరగొట్టి, ఇండియా-ఎ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ శ్రీలంకలో ఆడుతుండగా.. అతని తమ్ముడు ఆశీర్వాద్ బీహార్‌లో లోకల్ క్రికెట్ ఆడుతూ అన్న బాటలోనే పయనిస్తున్నాడు.