Uzbekistan Says Deaths Of 18 Children Linked To India-Made Cough Syrup: గాంబియా దేశంలో భారత దగ్గుమందు విషయం మరవక ముందే ఉజ్బెకిస్తాన్ కూడా అలాంటి ఆరోపణలే చేసింది. భారత కంపెనీకి చెందిన దగ్గుమందు వాడటం వల్ల తమ దేశంలో 18 మంది పిల్లలు మరణించారని అక్కడి ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణలపై భారత ప్రభుత్వం విచారణకు సిద్ధం అయింది. నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గుమందు డాక్-1 మాక్స్ సేవించి తమ దేశంలో పిల్లలు మరణించినట్లు ఉజ్బెకిస్తాన్ ఆరోపిస్తోంది.
ఈ సిరప్ లో విషపూరితమూన ఇథిలిన్ గ్లైకాల్ ఉన్నట్లు ప్రయోగశాల్లో తేలినట్లు అక్కడి మంత్రిత్వ శాఖ తెలిపింది. స్థానిక ఫార్మాసిస్ట్ సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండానే పిల్లలకు మందు ఇచ్చారని.. మోతాదుకు మించి మందు వాడటం కూడా మరణాలకు కారణం అయినాయనని పేర్కొంది. ఈ సిరప్ ను 2-7 రోజుల పాటు 2.5-5 ఎంఎల్ మోతాదులో రోజుకు మూడు నుంచి 4 సార్లు తీసుకున్నట్లు వెల్లడించింది. జలుబు నివారణకు తల్లిదండ్రులు ఈ సిరప్ మందును వాడారు.
Read Also: Elephant Fight: ఏనుగులకు కోపమొచ్చింది.. కొట్టుకున్నాయి..
పిల్లల మరణం తర్వాత దేశంలోని అన్ని ఫార్మసీల నుంచి డాక్-1 మాక్స్ టాబ్లెట్లను, సిరప్ లను తొలగించింది. దీనికి కారణంగా భావిస్తున్న ఏడుగురు ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. ప్రస్తుతం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఓ-నార్త్ జోన్), ఉత్తరప్రదేశ్ డ్రగ్స్ కంట్రోలింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ బృందాలు సంయుక్తంగా సదరు మందుల కంపెనీపై విచారణ ప్రారంభించాయి. ఉజ్బెకిస్తాన్ నుంచి మరిన్ని వివరాలను కోరుతామని తెలిపింది.
గతంలో కూడా ఆఫ్రికా దేశం గాంబియాలో కూడా 70 మంది పిల్లలు మరణించారు. దీనికి కూడా భారత్ లోని హర్యానాకు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన దగ్గు సిరప్ కారణం అని ఆ దేశం ఆరోపించింది. ఈ ఘటన తర్వాత సెంట్రల్ డ్రగస్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అక్టోబర్ లో సరైన ప్రమాణాలు పాటించడం లేదని హర్యానా సోనేపట్ లోని సదరు కంపెనీ తయారీ యూనిట్ ను మూసేసింది.