Site icon NTV Telugu

US-Colombia Diplomatic Tension: ఆ దేశాధ్యక్షుడి వీసా రద్దు చేసిన అగ్రరాజ్యం!

Gustavo Petro

Gustavo Petro

US-Colombia Diplomatic Tension: ఒకప్పుడు ఈ రెండు దేశాలు చారిత్రాత్మక మిత్రదేశాలు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇంతకీ ఈ రెండు దేశాలు ఏంటి, వాటి మధ్య మారిన పరిస్థితులు ఏంటి, ఏ దేశ అధ్యక్షుడికి అగ్రరాజ్యం వీసా రద్దు చేసిందనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసా.. ప్రపంచ దేశాల దృష్టిని ప్రస్తుతం అమెరికా, కొలంబియా దేశాలు ఆకర్షిస్తున్నాయి. ఎందుకనుకుంటున్నారు.. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడు లేని విధంగా గణనీయంగా క్షీణించాయి. న్యూయార్క్‌లో అమెరికా దళాలను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో వీసాను రద్దు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది.

READ ALSO: Muhammad Yunus: “పాకిస్తాన్ వెళ్లిపో”.. బంగ్లాదేశ్ యూనస్‌కు చేదు అనుభవం..

కొలంబియా అధ్యక్షుడి వీసా రద్దు..
అమెరికా దళాలను రెచ్చగొడుతున్నారని పేర్కొంటూ కొలంబియా అధ్యక్షుడు పెట్రో గుస్తావో వీసాను రద్దు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక పోస్ట్ చేసింది. “కొలంబియన్ అధ్యక్షుడు (పెట్రో గుస్తావో) న్యూయార్క్ నగర వీధిలో నిలబడి, ఆదేశాలను ధిక్కరించారని, అలాగే హింసను ప్రేరేపించాలని US దళాలను కోరినట్లు పేర్కొంది. ఆయన నిర్లక్ష్య, రెచ్చగొట్టే చర్యల కారణంగా తాము పెట్రో వీసాను రద్దు చేస్తున్నాము” అని వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ కోసం పెట్రో న్యూయార్క్‌లో ఉన్నారు. అక్కడ ఆయన ట్రంప్ పరిపాలనను తీవ్రంగా విమర్శించారు. ఆయన మంగళవారం తన ప్రసంగంలో కరేబియన్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా పడవలపై ఇటీవల అమెరికా జరిపిన దాడులపై క్రిమినల్ దర్యాప్తుకు పిలుపునిచ్చారు. ఈ దాడుల్లో దాదాపు డజను మంది నిరాయుధులైన, పేద యువకులు మరణించారని చెప్పారు. అయితే ఈ చర్యలు వెనిజులా తీరంలో అమెరికా మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో భాగమని వాషింగ్టన్ వాదిస్తోంది. ట్రంప్ దక్షిణ కరేబియన్‌కు ఎనిమిది యుద్ధనౌకలు, ఒక జలాంతర్గామిని పంపారు. ఇది ఇటీవలి సంవత్సరాలలో అతిపెద్ద US మోహరింపు.

అమెరికా దాడుల్లో మరణించిన వారిలో కొందరు కొలంబియన్లు ఉన్నారని పెట్రో అనుమానం వ్యక్తం చేశారు. గత వారం ట్రంప్ యంత్రాంగం మాదకద్రవ్యాలకు వ్యతిరేక పోరాటంలో భాగంగా కొలంబియాకు యూఎస్‌తో మిత్రదేశంగా ఉన్న గుర్తింపును రద్దు చేసింది. కానీ ఆర్థిక ఆంక్షలు మాత్రం విధించలేదు. ఈ దేశాలు చారిత్రాత్మకంగా మిత్రదేశాలుగా ఉన్నాయి. కానీ కొలంబియా మొదటి వామపక్ష నాయకుడు పెట్రో పాలనలో వారి సంబంధాలు గతంలో ఎన్నడూ లేని విధంగా క్షీణించాయి. కొలంబియా మంత్రి అర్మాండో బెనెడెట్టి శుక్రవారం రాత్రి Xలో ఒక పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వీసాను బదులుగా అమెరికా పెట్రో వీసా రద్దు చేసిందని విమర్శించారు.

READ ALSO: Bhutan Supports India UN: భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి: భూటాన్

Exit mobile version