Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!

Smartphones

Smartphones

Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఈ వారం (నవంబర్ 16 – నవంబర్ 22) పండగ వాతావరణం తీసుకురానుంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఒప్పో, షియోమీల నుండి కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాయి. నవంబర్ 16న ఒప్పో రెనో 17 సిరీస్‌ను చైనాలో విడుదల చేయనుండగా.. నవంబర్ 17న షియోమీ 18 ప్రో సిరీస్‌ను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేయనుంది.

ఒప్పో రెనో 17, రెనో 17 ప్రో లాంచ్

ఒప్పో నుండి కొత్త రెనో 17 సిరీస్‌ను నవంబర్ 16న చైనాలో విడుదల చేయనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ఈ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఇందులో ఒప్పో రెనో 17, రెనో 17 ప్రో స్మార్ట్‌ఫోన్లను launch చేయనున్నారు. ఇప్పటికే చైనాలో ఈ ఫోన్ల ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. ఇదే ఈవెంట్‌లో ఒప్పో ప్యాడ్ ఎయిర్ 6 ట్యాబ్లెట్, ఒప్పో వాచ్ 5 స్మార్ట్‌వాచ్‌ను కూడా లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ల డిజైన్ ఇప్పటికే వెల్లడైంది. ముఖ్యంగా రెనో 17 అడ్వెంచర్ క్యాట్ వేరియంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. బ్లూ లైట్‌లో ఈ ఫోన్ వెనుక భాగం మెరిసేలా ప్రత్యేక డిజైన్‌ను అందించారు. కోకో బ్రౌన్, ఫస్ట్ స్నో వైట్, ఐస్ మూన్ వైట్ కలర్ ఆప్షన్లలోనూ ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.

ఫీచర్ల విషయానికి వస్తే.. ఒప్పో రెనో 17 స్మార్ట్‌ఫోన్‌లో 6.56 అంగుళాల 1.5K ఫ్లాట్ డిస్‌ప్లే ఇవ్వనున్నట్లు సమాచారం. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేయనున్న ఈ ఫోన్‌లో భారీ 8,000mAh బ్యాటరీ ఉండనుంది. దీనికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రెనో 17 ప్రో మోడల్ కొంత కాంపాక్ట్ డిజైన్‌తో రానుంది. ఇందులో 6.32 అంగుళాల 1.5K ఫ్లాట్ డిస్‌ప్లే, డైమెన్సిటీ 8550 సూపర్ చిప్‌సెట్ ఉండనున్నట్లు లీకులు చెబుతున్నాయి. ఈ ఫోన్‌లో 7,200mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉండనుంది. రెండు ఫోన్లలోనూ మెటల్ ఫ్రేమ్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించనున్నారు.

కెమెరాల విషయానికి వస్తే.. రెనో 17, రెనో 17 ప్రో రెండింటిలోనూ 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండనున్నట్లు సమాచారం. ప్రో మోడల్‌లో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గరిష్ఠంగా 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్లు రావచ్చు. ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్‌ఓఎస్ 17తో పనిచేయనున్నాయి. భారత్‌లో ఈ ఫోన్ల విడుదలపై ఒప్పో ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే రెనో 17 మోడల్ 2027 ప్రారంభంలో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా. దీనితో పాటు రెనో 17c కూడా విడుదల కావచ్చని తెలుస్తోంది. కానీ రెనో 17 ప్రో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు సమాచారం.

షియోమీ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ గ్లోబల్ లాంచ్

షియోమీ నుండి కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనుంది. నవంబర్ 17న ఫ్రాన్స్‌లోని పారిస్‌లో షియోమీ 18 ప్రో, షియోమీ 18 ప్రో మ్యాక్స్ గ్లోబల్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. చైనాలో విడుదలైన సుమారు రెండు నెలల తర్వాత ఈ ఫోన్లు గ్లోబల్ మార్కెట్లోకి రానున్నాయి. వెల్వెట్ రెడ్, కాస్మిక్ బ్లూ, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఫోన్లలో ప్రధాన ఆకర్షణ వెనుకవైపు కెమెరాల పక్కన అందించే సెకండరీ డిస్‌ప్లే. షియోమీ 18 ప్రో మ్యాక్స్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్ ఉండనుంది. సాధారణ 18 ప్రో మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్‌సెట్ ఇవ్వనున్నట్లు సమాచారం.

రెండు ఫోన్లలోనూ ముందు, వెనుక భాగాల్లో ఎల్‌టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేలు ఉండనున్నాయి. కెమెరాల పరంగా 200MP మెయిన్ సెన్సార్, 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా అందించనున్నారు. అయితే చైనా వేరియంట్లతో పోలిస్తే గ్లోబల్ మోడళ్లలో బ్యాటరీ సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. రిటైల్ లిస్టింగ్ ప్రకారం షియోమీ 18 ప్రోలో 6,000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 18 ప్రో మ్యాక్స్‌లో చైనా వేరియంట్‌లోని 8,500mAh బ్యాటరీకి బదులుగా 7,050mAh బ్యాటరీ ఉండవచ్చని సమాచారం. అయితే ఇందులో 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కొనసాగనుంది. భారత్‌లో షియోమీ 18 ప్రో విడుదల ఇప్పటికే ఖరారైంది. అయితే గ్లోబల్ లాంచ్ తర్వాత ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం మరో ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉంది. షియోమీ 18 ప్రో మ్యాక్స్ భారత్‌లో విడుదలవుతుందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

మరిన్ని ఫోన్ల లాంచ్‌లు

ఈ రెండు సిరీస్‌లతోనే నవంబర్ స్మార్ట్‌ఫోన్ సందడి ముగియడం లేదు. ఈ నెల చివరి వారంలో వివో తన X500 సిరీస్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. నవంబర్ 26న వివో X500, X500 ప్రో, X500 ప్రో మ్యాక్స్ మోడళ్లను పరిచయం చేయనుంది. వీటితో పాటు వాచ్ జీటీ2 స్మార్ట్‌వాచ్‌ను, ప్రో మ్యాక్స్ మోడల్ కోసం ప్రత్యేక ఫొటోగ్రాఫర్ కిట్‌ను కూడా విడుదల చేయనుంది.

మరోవైపు మోటరోలా సిగ్నేచర్ 27 స్మార్ట్‌ఫోన్ కూడా ఈ నెలలోనే భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మోటరోలా ఇండియా వెబ్‌సైట్‌లో ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేక పేజీ అందుబాటులోకి వచ్చింది. అయితే కంపెనీ కచ్చితమైన విడుదల తేదీని ప్రకటించలేదు. ఇంకా బడ్జెట్ విభాగంలో వొబుల్ స్పీడ్ 5G స్మార్ట్‌ఫోన్ కూడా త్వరలో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడంతో ఈ ఫోన్ లాంచ్‌పై ఆసక్తి పెరిగింది.