NTV Telugu Site icon

Umarn Malik: నేను బాగానే ఉన్నా.. టీమిండియాలోకి మళ్లీ వస్తా!

Umran Malik

Umran Malik

Umarn Malik About Team India Re-Entry: ‘ఉమ్రాన్‌ మాలిక్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతూ ఫాస్టెస్ట్‌ బంతిని విసిరిన ఈ ‘కశ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌’ అందరి దృష్టిని ఆకర్షించాడు. 157 కిమీ వేగంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన బంతిని ఉమ్రాన్ సంధించాడు. ఐపీఎల్ ప్రదర్శనతో 2022లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. 10 వన్డేలు, 8 టీ20లు ఆడిన అతడు గాయాలతో జట్టుకు దూరమయ్యాడు. గాయాల నుంచి కోలుకొని మ్యాచ్‌లకు సిద్ధమయ్యాడు. ఈలోగా డెంగీ బారినపడ్డాడు. డెంగీ నుంచి కూడా కోలుకొని ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు.

సెప్టెంబర్ 5 నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. రుతురాజ్‌ గైక్వాడ్ నాయకత్వంలోని టీమ్‌ సీలో ఉమ్రాన్‌ మాలిక్‌ ఆడనున్నాడు. దులీప్ ట్రోఫీకి సిద్దమవుతున్న ఉమ్రాన్‌ తాజాగా మాట్లాడుతూ… ‘నేను ఇప్పుడు బాగున్నాను. గాయాలు, డెంగీ నుంచి పూర్తిగా కోలుకున్నా. దులీప్‌ ట్రోఫీపై దృష్టిపెట్టా. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నా. తప్పకుండా భారత జట్టులోకి మళ్లీ వస్తా. అందుకు ఈ సీజన్‌ను వినియోగించుకుంటా. దులీప్ ట్రోఫీ మా జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నా’ అని చెప్పాడు.

Also Read: PAK vs BAN: బాధ పడటం లేదు.. ఆ విషయం రిజ్వాన్‌కు ముందే తెలుసు!

ఉమ్రాన్‌ మాలిక్‌ ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతూ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందిపెట్టాడు. లీగ్ దశలో సన్‌రైజర్స్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఉమ్రాన్ ‘ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచాడు. 14 మ్యాచ్‌లలో 22 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఇబ్బందిపడిన ఉమ్రాన్‌.. ప్రధాన బౌలర్‌గా మాత్రం మారలేదు. పేస్‌ బాగున్నా భారీగా పరుగులు ఇస్తుండడం అతడికి ప్రతికూలంగా మారింది. 2024లో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆడాడు.