UIDAI Important Update: యూఐడీఏఐ (UIDAI) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. ఆధార్ కార్డు వినియోగదారులందరూ తప్పక తెలుసుకోవాల్సిన మార్పును సూచిస్తోంది. ఇప్పటివరకు మనలో చాలామంది ఆధార్ కార్డును కేవలం గుర్తింపు కార్డుగానే కాకుండా పుట్టిన తేదీకి (Date of Birth) బలమైన ఆధారంగా భావిస్తూ వస్తున్నాం. అయితే, ఇకపై ఆధార్‌ను పుట్టిన తేదీ ధృవీకరణ కోసం ప్రామాణిక పత్రంగా పరిగణించకూడదని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఆధార్ కేవలం మీ గుర్తింపును, నివాసాన్ని నిరూపించే పత్రం మాత్రమేనని, వయసును నిర్ధారించే పత్రం కాదని అధికారులు తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆధార్ అథెంటికేషన్ సర్వీసులను ఉపయోగించే ఏజెన్సీలకు (AUA/KUA) ప్రత్యేక లేఖలను పంపారు.
ఆధార్‌ను పుట్టిన తేదీకి ఆధారంగా ఎందుకు తీసుకోకూడదనే విషయంలో యూఐడీఏఐ సహేతుకమైన కారణాలను వెల్లడించింది. సాధారణంగా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు లేదా అప్‌డేట్ చేసేటప్పుడు నివాసితులు ఇచ్చే సమాచారం ఆధారంగానే పుట్టిన తేదీని నమోదు చేస్తారు. ఒకవేళ ఎవరి వద్దనైనా సరైన బర్త్ సర్టిఫికేట్ లేదా స్కూల్ సర్టిఫికేట్ వంటి పత్రాలు లేకపోతే, వారు చెప్పిన వయసును బట్టి సిస్టమ్ ఆటోమేటిక్‌గా పుట్టిన సంవత్సరాన్ని లెక్కగట్టి, డిఫాల్ట్‌గా ఆ ఏడాది జనవరి 1వ తేదీని పుట్టిన తేదీగా మారుస్తుంది. ఇలాంటి “డిక్లేర్డ్” పుట్టిన తేదీలు వాస్తవ తేదీతో విభేదించే అవకాశం ఉండటం వల్ల, దీనిని అధికారిక బర్త్ ప్రూఫ్‌గా పరిగణించలేమని స్పష్టం చేశారు. కేవలం బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ డేటా ద్వారా సదరు వ్యక్తి గుర్తింపును ధృవీకరించడమే ఆధార్ ప్రధాన ఉద్దేశమని గుర్తుంచుకోవాలి.
అయితే, ఆధార్ కార్డు ఇతర ప్రయోజనాల్లో ఎలాంటి మార్పు లేదని యూఐడీఏఐ తెలిపింది. భౌతిక ఆధార్ కార్డుతో పాటు ఈ-ఆధార్, మాస్క్‌డ్ ఆధార్, ఆఫ్‌లైన్ XML, క్యూఆర్ కోడ్ (QR Code) వంటివన్నీ గుర్తింపు కార్డుగా, అడ్రస్ ప్రూఫ్‌గా యథావిధిగా చెల్లుబాటు అవుతాయి. వివిధ ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు లేదా ఇతర సేవల కోసం ఆధార్‌ను పుట్టిన తేదీకి ప్రామాణికంగా వాడాలా వద్దా అనే నిర్ణయాన్ని ఆయా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలే తీసుకోవాలని యూఐడీఏఐ సూచించింది. అయినప్పటికీ, పాస్‌పోర్ట్ లేదా ఇతర చట్టపరమైన కార్యకలాపాల కోసం పుట్టిన తేదీని నిరూపించాల్సి వస్తే మాత్రం బర్త్ సర్టిఫికేట్ లేదా టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో వంటి పత్రాలనే సిద్ధం చేసుకోవడం ఉత్తమం.
