Uday Krishna Reddy: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేసి, ఉదయ్ కృష్ణారెడ్డిపై మరిన్ని కఠిన సెక్షన్లను నమోదు చేశారు. మొదట నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో లేని రెండు కీలకమైన, తీవ్రమైన నేర విభాగాలు ఈ విచారణ ప్రక్రియలో వెలుగులోకి వచ్చాయి.
కేసు దర్యాప్తులో భాగంగా బాధితురాలితో పాటు నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్లను సమగ్రంగా పరిశీలించిన తర్వాత పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డిపై కొత్తగా భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం హత్యాయత్నం (సెక్షన్ 109 BNS) కేసుతో పాటు, లైంగిక దాడి/రేప్ (సెక్షన్ 64(1) BNS) సెక్షన్లను కూడా చేర్చారు. ఈ కొత్త సెక్షన్లను కేసు నమోదుకు జత చేస్తూ పోలీసులు ఇప్పటికే న్యాయస్థానంలో అధికారికంగా మెమో దాఖలు చేశారు. కాగా, నిన్న సాయంత్రం ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను ఆగస్టు 11వ తేదీ వరకు రిమాండ్‌కు తరలించగా, ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. తొలుత సాధారణ తీవ్రతతో ఉన్నట్లు కనిపించిన ఈ కేసు, బాధితురాలి వాంగ్మూలం, విచారణలో లభించిన ఆధారాల ఆధారంగా ఏకంగా హత్యాయత్నం, అత్యాచారం సెక్షన్లు తోడవడంతో మరింత క్లిష్టంగా మారింది. ట్రైనీ ఐపీఎస్ స్థాయి అధికారిపై ఇన్ని తీవ్రమైన కేసులు నమోదు కావడం ఐపీఎస్ వర్గాల్లోనూ, సాధారణ ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.

