అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ దేవాలయం (BAPS Hindu Temple) సందర్శనకు ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఫిబ్రవరి 14న ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ఆలయం ప్రారంభమైంది. గత నెలాఖరు వరకు వీఐపీలకు ఆలయ అధికారులు అనుమతి ఇచ్చారు. మార్చి 1 నుంచి ప్రజల సందర్శనార్థం అనుమతి ఇచ్చారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు (Public) తరలివచ్చారు. గత ఆదివారం ఒక్కరోజే 65 వేల మంది ప్రజలు సందర్శించి రికార్డ్ సృష్టించింది.
ఇక కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ఆలయ ప్రారంభ రోజున ఆలయాన్ని సందర్శించి దాదాపు మూడు గంటల అక్కడే గడిపారు. పాలరాతితో నిర్మించిన ఆలయం అద్భుతంగా ఉందని కొనియాడారు.
ఆలయాన్ని సందర్శించిన భక్తులు కూడా ఆలయ నిర్మాణాన్ని మెచ్చుకుంటున్నారు. యూఏఈలో (UAE) నిర్మించిన తొలి హిందూ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని కితాబు ఇస్తున్నారు. అలాగే ఆలయం దగ్గర పని చేస్తున్న వాలంటీర్ల సేవ కూడా బాగుందని మెచ్చుకుంటున్నారు.
యూఏఈ ప్రభుత్వ పెద్దలు ఆలయం నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించారు. దీంతో భారత్ నుంచి వచ్చిన కళాకారుల చేత ఈ హిందూ దేవాలయాన్ని నిర్మాణం చేశారు. గత నెల 13, 14 తేదీల్లో ప్రధాని మోడీ యూఏఈలో పర్యటించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 14న మోడీ ఈ ఆలయాన్ని ప్రారంభించారు.