Site icon NTV Telugu

Donald Trump: “యుద్ధం ముగింపునకు దగ్గర్లో ఉంది”.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన..

Trump

Trump

Donald Trump: అమెరికా-ఇరాన్ వివాదం కీలక మలుపు తిరుగుతోంది. ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు ముగింపు దశకు చాలా దగ్గరగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్ రాజధానిలో చర్చలను పునరుద్ధరణకు చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ట్రంప్ ఈ ప్రకటన చేయడం విశేషంగా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా గనుక సరైన సమయంలో జోక్యం చేసుకోకపోయి ఉంటే, ఈపాటికే ఇరాన్ అణ్వస్త్ర శక్తిగా అవతరించి ఉండేదని ట్రంప్ పేర్కొన్నారు. తాము తీసుకున్న చర్యల వల్లే ప్రపంచ సమతుల్యత దెబ్బతినకుండా కాపాడగలిగామని స్పష్టం చేశారు. అలా జరిగి ఉంటే, ప్రపంచ సమతుల్యత పూర్తిగా మారిపోయి ఉండేదని చెప్పారు. యుద్ధం ముగిసిందా? అనే ప్రశ్నకు ట్రంప్ సమాధానమిస్తూ.. “యుద్ధం ముగింపునకు చాలా దగ్గరలో ఉందని నేను భావిస్తున్నాను” అని బదులిచ్చారు. ఇరాన్‌తో చర్చలకు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఇప్పుడే తాను ఈ ప్రయత్నాలను విరమిస్తే, ఇరాన్ తన దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి మరో 20 ఏళ్లు పడుతుందని, అందుకే ఆ దేశం కూడా ఒక ఒప్పందం (డీల్) కోసం ఆరాటపడుతోందని విశ్లేషించారు. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో పాకిస్థాన్ పోషిస్తున్న పాత్రను ట్రంప్ బహిరంగంగానే ప్రశంసించారు. ముఖ్యంగా పాక్ సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ మధ్యవర్తిత్వాన్ని ఫెంటాస్టిక్ అని కొనియాడారు. మునీర్ చొరవ వల్లే ఇరు దేశాల మధ్య మళ్ళీ చర్చల మార్గం సుగమమైందని, చర్చలు సఫలమైతే అమెరికా ప్రతినిధులు మళ్ళీ ఇస్లామాబాద్‌కు చేరుకుంటారని సంకేతాలిచ్చారు.

READ MORE: God Of War : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ‘ గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్‌మెంట్‌ కు డేట్ లాక్

ఇక మరోవైపు.. ఈ ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. అమెరికా ఆంక్షలు విధించిన తొలిరోజే అనేక నౌకలు తమ మార్గాలను మార్చుకోవాల్సి వచ్చింది. యుద్ధ భయాలు, సరఫరాలో అంతరాయం కారణంగా ముడి చమురు ధర ఒక్కసారిగా బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటేసింది. అయితే, మళ్ళీ చర్చలు మొదలయ్యే అవకాశం ఉందన్న వార్తలతో ధరలు కాస్త తగ్గి 95 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. ప్రస్తుతం ఇరాన్ కూడా తన పంతాన్ని వీడటం లేదు. ముఖ్యంగా యురేనియం శుద్ధి, హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ విషయంలో ఆ దేశం పట్టుదలగా ఉంది. ఇప్పుడు ప్రపంచమంతా ఇస్లామాబాద్‌ వైపు ఆశగా చూస్తోంది. అక్కడ జరగబోయే తదుపరి రౌండ్ చర్చలు గనుక సఫలమైతే ఏళ్ల నాటి శత్రుత్వానికి ముగింపు పడుతుంది. లేదంటే, మధ్యప్రాచ్యంలో మళ్ళీ అల్లకల్లోలం తప్పదన్న ఆందోళన నెలకొంది.

Exit mobile version