ఖాళీ అయినవి ఆరు ఎమ్మెల్సీ స్థానాలు. కానీ పదవి ఆశిస్తోంది పదులు సంఖ్యలో. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ ఎవరికి అవకాశం ఇవ్వనుంది ? ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకోనుంది.? తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అసెంబ్లీలో స్పష్టమైన మెజార్టీ ఉండడంతో … ఆరు ఎమ్మెల్సీ స్థానాలు అధికార టీఆర్ఎస్ పార్టీకే దక్కుతాయి. దీంతో అధికార పార్టీలోని ఆశవాహులు ఎమ్మెల్సీ స్థానం దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే తమకు తెలిసిన నేతలు, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేల సాయం తీసుకుని… పార్టీ పెద్దలను కలిసే పనిలో ఉన్నారు. టీఆర్ఎస్‌లో మొదటి నుంచి ఉన్నవారు … మధ్యలో వచ్చిన వారు … పార్టీ అధికారంలోకి వచ్చాక చేరిన నేతలు ఇలా అందరూ ఎవరి స్థాయిలో వారు .. తమ ప్రయత్నాల్లో ఉన్నారు. ఒక్కో జిల్లా నుంచి ఐదారుగురు .. ఎమ్మెల్సీ ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి వరంగల్, నల్గోండ జిల్లాల నుంచి ఎమ్మెల్సీ స్థానాలు అశిస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారు.. ఎమ్మెల్సీలుగా పదవీకాలం ముగిసిన వారు కూడా ఎమ్మెల్సీగా ప్రయత్నాలు చేస్తున్నవారిలో ఉన్నారు. సామాజిక సమీకరణాలు, పార్టీ అవసరాలు.. వీటిన్నింటిని పరిగణలోకి తీసుకొని అధిష్ఠానం.. నేతలను ఎంపికచేయనుంది. టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ నెల 15న అధికారికంగా ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే ఒకరిద్దరు నేతలకు నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సంకేతాలు వెళ్లినట్టు తెలుస్తోంది.
