హిమాలయాల్లో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలని దాదాపు ప్రతి అధిరోహకుడి కోరిక. అయితే ఈ కోరిక చాలా మంది ప్రాణాలను కూడా తీసింది. ఈ సంవత్సరం, ఎవరెస్ట్‌పై అధిరోహణ సీజన్ ప్రారంభమైన వెంటనే వందలాది మంది అధిరోహకులు ఎవరెస్ట్‌పై గుమిగూడడం ప్రారంభించారు. గత వారం ఐదుగురు అధిరోహకులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఇంతలో తాడు సహాయంతో ఎవరెస్ట్‌ను అధిరోహించే ప్రయత్నంలో వందలాది మంది ప్రజలు ఉక్కిరిబిక్కిరి చేస్తూ నెమ్మదిగా పైకి జారడానికి ప్రయత్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరెస్ట్‌పై ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది.
READ MORE: Flight: విమానంలో నగ్నంగా పరుగులు.. ప్యాసింజర్స్ షాక్
రాజన్ ద్వివేదీ అనే పర్వతారోహకుడు ఈ నెల 19న ఉదయం 6 గంటలకు విజయవంతంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. ఈ నెల 20న తిరిగి కిందకు దిగే క్రమంలో సుమారు 500 మంది పర్వతారోహకులు తనకు ఎదురుగా రావడాన్ని వీడియోలో చిత్రీకరించి తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం అంటే జోక్ కాదు. ఇది ఎంతో కష్టతరమైన విషయం’ అని అందులో పేర్కొన్నాడు. తనకు దారిలో కనిపించిన వారిలో 250 నుంచి 300 మంది మాత్రమే ఎవరెస్ట్ ను అధిరోహించగలరని పేర్కొన్నాడు. 1953లో మొదలైన ఎవరెస్ట్ పర్వతారోహణ నుంచి ఇప్పటివరకు సుమారు 7 వేల మంది మాత్రమే శిఖరంపైకి చేరుకున్నారని వివరించాడు. రద్దీ వల్ల తాను కిందకు దిగడం ఓ పీడకలలా అనిపించిందని, కిందకు దిగే క్రమంలో నీరసించిపోయాయని చెప్పాడు. పర్వతారోహకులంతా తాళ్ల సాయంతో ఎక్కేందుకు ఒకే వరుసలో వస్తుండటం ఆ వీడియోలో కనిపించింది. ఈ వీడియోకు ఇన్ స్టాలో సుమారు 30 లక్షల వ్యూస్, 18 వేల లైక్ లు లభించాయి. మరోవైపు ‘ఎక్స్’లో చక్కర్లు కొడుతున్న ఇలాంటి మరో వీడియోకు ఏకంగా 66 లక్షల వ్యూస్ వచ్చాయి.
అయితే ఈ వీడియోలను చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. పర్వతారోహణ స్వార్థపూరితం అయిపోయిందని.. ప్రాణాలు పోయినా, సాయం కోసం అర్థిస్తున్నా ఎవరూ పట్టించుకోరని ఓ యూజర్ మండిపడ్డాడు. శిఖరాన్ని పూర్తిగా చెత్తాచెదారంతో నింపేస్తున్నారని తప్పుబట్టాడు. ప్రపంచం ఇలా తప్పుడు మార్గంలో ఎందుకు వెళ్తోందంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. మరొకరు స్పందిస్తూ ఎవరెస్ట్ ఎక్కడం ఇప్పుడు ప్రత్యేకం ఏమీ కాదని అభిప్రాయపడ్డాడు. డబ్బున్న కొందరు వ్యక్తులు తమను తాము మరణానికి అతీతులమని భావిస్తున్నారని మరో నెటిజన్ విమర్శించాడు.