NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

తెలంగాణ సహా 12 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది. మొత్తం 12 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది. ఈ మేరకు ఐఎండీ లిస్టు విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. అలాగే మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, పంజాబ్, హర్యానా మరియు హిమాచల్ ప్రదేశ్‌లలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

రామోజీని ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం నిలబడలేదు..

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు నేడు అనారోగ్యంతో మరణించారు..గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామోజీరావును ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నానక్ రామ్ గూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమించింది.దీనితో ఆయనను ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉంచారు.వెంటిలేటర్ పై చికిత్స పొందుతూనే రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుది శ్వాస విడిచిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ప్రస్తుతం రామోజీరావు పార్థివదేహాన్ని ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసానికి తరలించారు.రామోజీరావు మన మధ్య లేరనే వార్త తెలుసుకున్న సినీ,రాజకీయ ప్రముఖులు,అభిమానులు ఆయన నివాసానికి భారీగా చేరుకొని ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్నారు.

రోజుకు 3 రంగుల్లోకి మారుతున్న శివలింగం.. ఎక్కడంటే..

భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి. చాలా ఆలయాలకు విశిష్ట రహస్యాలు నెలకొని ఉంటాయి. ఈ ఆలయాలు శతాబ్దాలుగా వాటికి రహస్యాలు కోల్పోకుండా అలాగే కొనసాగుతున్నాయి. అచ్చం అలాంటి విశిష్టత కలిగిన ఓ శివాలయం రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్‌పూర్‌లోని అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఉంది. ఇక ఈ గుడిలోని మిస్టరీ వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ దేవాలయం భారతదేశంలో ఉన్న శివాలయాల్లో మిస్టరీ ఆలయంగా మిగిలిపోతుంది. ఈ ఆలయం సైన్సుకు సవాల్ గా మారింది. మిస్టరీ గురించి పూర్తి వివరాలు చూస్తే..

రేపు గ్రూప్-1 ప్రిలిమ్స్.. 30 నిమిషాల ముందే గేట్‌ క్లోజ్‌

రేపు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరుగనుంది. అభ్యర్థులు తమ తమ పరీక్షా కేంద్రాలకు ఉదయం 10:00 గంటలకు ముందే చేరుకోవాలని సూచించారు. 897 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. 10:00 AM తర్వాత ఒక నిమిషం ఆలస్యంగా వచ్చేవారు అనుమతించబడరు. TSPSC గ్రూప్-1 పరీక్ష గ్రూప్-1 సర్వీసెస్‌లో డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, జిల్లా పంచాయతీ రాజ్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ వంటి పాత్రలతో సహా 563 పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

రామోజీ కుటుంబ సభ్యులకు ప్రధాని సందేశం అందించిన నిర్మలా సీతారామన్

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విచారం వ్యక్తం చేశారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రధాని మోడీ సందేశాన్ని నిర్మలా సీతారామన్‌ అందించారు. రామోజీ మరణవార్త తెలిసి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపమని ప్రధాని తనను పంపారని ఆమె పేర్కొన్నారు. ఆయన మరణం తెలుగువారికి తీరని లోటు అన్నారు. తెలుగువారికి ఇదొక పెద్ద విషాదమని.. రామోజీ ఆరోగ్య పరిస్థితిపై రెండు రోజుల కిందట కూడా ప్రధాని ఆరా తీశారని నిర్మల పేర్కొన్నారు. ప్రజలకు ఆయన చేసిన సేవలు ప్రధానికి తెలుసునన్నారు. మనందరికీ ఇదొక పెద్ద విషాదవార్త అన్నారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.

చెదురుమదురుగా కురుస్తున్న వర్షాలతో చల్లగా మారిన భాగ్యనగరం

చెదురుమదురుగా కురుస్తున్న భారీ వర్షాలతో కూడిన ఆహ్లాదకరమైన చల్లని వాతావరణాన్ని హైదరాబాద్ వాసులు ఆస్వాదించారు. వారి స్వల్ప వ్యవధి కేవలం 20 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు ఉన్నప్పటికీ, కుండపోత వర్షం నగరం తడిసి ముద్దయింది. భారత వాతావరణ విభాగం (IMD) హైదరాబాద్ ప్రకారం, జూన్ 13 వరకు 33 డిగ్రీల సెల్సియస్ నుండి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే వాతావరణాన్ని అంచనా వేయడంతో నగరంలో ఉష్ణోగ్రత దాదాపు 33 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది.

రేపే మోడీ ప్రమాణస్వీకారం.. విపక్షాలకు అందని ఆహ్వానాలు

ఆదివారం మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 7:15 నిమిషాలకు రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ద్రౌపది ముర్ము.. మోడీచే ప్రమాణం చేయించనున్నారు. అయితే ఈ ప్రమాణస్వీకారానికి విపక్ష పార్టీలను ఇప్పటి వరకు ఆహ్వానించలేదు. కాంగ్రెస్‌కు కానీ.. ఇండియా కూటమి నేతలకు గానీ ఇప్పటి వరకు ఆహ్వానాలు పంపలేదు. ఈ మేరకు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. మోడీ ప్రమాణస్వీకారానికి విదేశీయులను ఆహ్వానించారు కానీ.. విపక్షాలను మాత్రం ఆహ్వానించలేదని తెలిపారు. ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని కేసీ.వేణుగోపాల్ కూడా తెలియజేశారు.

టీడీపీ రెండు కేంద్ర మంత్రి పదవులు

కేంద్రంలో కొలువుదీరబోయే ఎన్డీయే ప్రభుత్వ మంత్రివర్గంలో టీడీపీకి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ల పేర్లు ఖరారయ్యాయి. రామ్మోహన్‌ నాయుడికి కేంద్ర కేబినెట్‌ హోదా, పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర సహాయ మంత్రి పదవి ఖరారైనట్లు ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. కేంద్రంలో కొలువుదీరబోయే ఎన్డీయే ప్రభుత్వ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ తన స్థానాల్ని డబుల్‌ చేసుకోగా.. ఏపీలోనూ కూటమి ద్వారా మంచి ఫలితాన్నే రాబట్టగలిగింది. ఎన్డీయే భాగస్వామి పక్షాల అధినేతలతో విడివిడిగా శుక్రవారం జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఛాన్స్ లభించింది. అయితే వీరికి కేంద్రంలో ఏ శాఖ దక్కనుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే మంత్రిత్వ శాఖలు తీసుకుంటామని టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పట్టణాభివృద్ధి, జలవనరుల శాఖ, పరిశ్రమల శాఖలను టీడీపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ చొప్పదండికి చేరిన పిఠాపురం ట్రెండ్

ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురంలో మొదలైన ట్రెండ్ కరీంనగర్‌కు చేరినట్లు కనిపిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విజయం సాధించడంతో ఆయన అభిమానులు తమ వాహనాలు, నంబర్‌ ప్లేట్‌లపై పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా (పిఠాపురం ఎమ్మెల్యేకు చెందినవారు) అని రాసుకోవడం ప్రారంభించారు. రాతలకు సంబంధించిన వీడియోలు , ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది మరింత ప్రాచుర్యం పొందింది. చొప్పదండి నియోజకవర్గంలోనూ ఇదే ట్రెండ్ మొదలైంది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అనుచరుడు కూడా తన ద్విచక్ర వాహనంపై ఇలాంటి పదాలు రాశాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతపూర్‌కు చెందిన నక్కా అనిల్ తన వాహనం నెంబర్ ప్లాట్‌పై మేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యే తాలుకు అని రాసుకున్నాడు. ఆయన రాసిన ఫొటోలు, వీడియోలు జిల్లాలోని పలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి.. రేపు, ఎల్లుండి సంతాప దినాలు

ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘనంగా నివాళులర్పించింది. రామోజీరావు మృతికి నివాళిగా రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. రేపు, ఎల్లుండి సంతాప దినాలను ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు రోజుల పాటు ఎటువంటి అధికారిక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించదు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్‌సిటీకి తరలించగా.. ఆయనకు నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు.