NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌!

Top Headlines@9am

Top Headlines@9am

దర్శన టికెట్లు ఉన్న భక్తులకే తిరుమలలో గదులు:
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి కొండపై వసతి గదులకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే.. మొదటిసారిగా వసతి గదుల కేటాయింపును ఆన్‌లైన్‌లో చేపట్టింది. దర్శన టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే గదులు ఇవ్వడం ద్వారా.. భక్తుల రద్దీని కాస్త తగ్గించొచ్చని టీటీడీ భావిస్తోంది. శ్రీవారి ఆర్జిత సేవలు, లక్కీడిప్‌, వృద్ధులు, దివ్యాంగులు, శ్రీవాణి ట్రస్టు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ జనవరి 18 నుంచి 24 వరకు జారీ చేసింది. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్‌ఈడీ) టికెట్లను భక్తులు 2.45 నిమిషాల్లోనే కొనుగోలు చేశారు.

ఉప్పల్ స్టేడియంకు 60 ప్రత్యేక బస్సులు:
క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. నేటి నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వెళ్తున్న క్రికెట్ అభిమానులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) శుభవార్త అందించింది. ఈ మ్యాచ్‌ చూసేందుకు వెళ్లే క్రికెట్ అభిమానులకు ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. జనవరి 25 నుంచి 29 వరకు (ఐదు రోజుల పాటు) నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు 60 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. బస్సులు ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ప్రారంభమై తిరిగి 7 గంటలకు స్టేడియానికి చేరుకుంటాయి.

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో భారీగా బయటపడుతున్న ఆస్తులు:
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో భారీగా ఆస్తులు బయటపడుతున్నాయి. మార్కెట్ వేల్యూ ప్రకారం 300 నుంచి 400 కోట్ల రూపాయల ఆస్తులుగా గుర్తించారు. నగలు నగదు ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నానక్ రామ్ గూడలోని బాలకృష్ణ ఇంట్లో 84 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోగా.. హైదరాబాద్ లో విల్లాలు, ఫ్లాట్లతో పాటుగా శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ ల్యాండ్ ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 100 ఎకరాల ల్యాండ్ పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 20 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బాలకృష్ణ ఇంటితో పాటు బంధువులు, మిత్రులు కంపెనీలో సోదాలు చేస్తున్నారు. దాదాపు రెండు కిలోల పైచిలుకు బంగారు ఆభరణాలు భారీగా వెండి స్వాధీనం చేసుకోగా.. 80కి పైగా అత్యంత ఖరీదైన వాచీలు.. పెద్ద మొత్తంలో ఐఫోన్లను అధికారులు సీజ్ చేశారు. కొడకండ్లలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాల, జనగామలో 24 ఎకరాల లాంటి పత్రాలు స్వాధీన పరుచుకున్నారు. భూములు అన్ని కూడా బినామీల పేర్ల మీద ఉన్నట్లు గుర్తించారు.

BVP నాయకురాలిని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన పోలీసులు:
జీవో నెం.55కి వ్యతిరేకంగా హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గత కొన్ని రోజులుగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. విద్యార్థులకు మద్దతుగా.. నిన్న ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో.. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ అక్కడి నుంచి పరుగు తీశారు. అయితే ఝాన్సీని పట్టుకునేందుకు ఇద్దరు మహిళా పోలీసులు స్కూటీపై వెంబడించారు. తన దగ్గరకు రాగానే.. వెనుక ఉన్న పోలీసు తనను అడ్డుకునే ప్రయత్నంలో ఝాన్సీ జుట్టును పట్టుకున్నారు. అయితే.. స్కూటీ నడుస్తుండగా ఝాన్సీ కిందపడిపోయింది. అయినా కూడా ఝాన్సీని వదలకుండా అలాగే జుట్టును గట్టిగా పట్టుకునే వున్నారు. అయితే వెంటనే బండిని ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. స్కూటీని ఆపి ఆమెను అలాగే పట్టుకుని ఉన్నారు. ఝాన్సీ లేచి పోలీసులపై సీరియస్ అయ్యారు.

అమెరికా- బ్రిటన్ మధ్య చిచ్చు పెట్టిన టీ:
అమెరికా- బ్రిటన్ దేశాల మధ్య ఈ టీ వల్ల వివాదం చెలరేగింది. యూఎస్ కు చెందిన ఓ ప్రొఫెసర్‌ టీ ఎలా తయారు చేయాలో చెబుతూ చేసిన సూచన బ్రిటన్ వాసులను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో లండన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పాడింది. అయితే, పెన్సిల్వేనియాలోని బ్రైన్ మావర్ కాలేజీలో మిషెల్‌ ఫ్రాంక్‌ కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. అయితే, టీని ఎలా తయారు చేయాలో చాలా రీసెర్చ్ చేశానని స్వయంగా ఆమె చెప్పారు. అందుకోసం పురాతన గ్రంథాలను సైతం తిరగేశాను అని పేర్కొన్నారు. ఛాయ్ చక్కగా కుదరాలంటే దాంట్లో చిటికెడు ఉప్పు వేయాలని ఆమె సూచించారు. ఇదే విషయాన్ని ఆమె ‘స్టీప్డ్‌: ది కెమిస్ట్రీ ఆఫ్‌ టీ’ అనే పుస్తకంలో రాసుకొచ్చింది. ఆ పుస్తకం కాస్తా ఇటీవలే యూకేలో విడుదలైంది.

భారత్ కు మద్దతుగా నిలిచిన మాల్దీవుల ప్రతిపక్ష పార్టీలు:
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదస్పద కామెంట్స్ తో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు క్షిణించిపోతున్నాయి. దీంతో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ చైనా పర్యటన తర్వాత తన సైనికులను ఉపసంహరించుకోవాలని భారతదేశాన్ని కోరారు. దీంతో దేశవ్యాప్తంగా కూడా ఆయనపై విమర్శల పర్వం మొదలైంది. ఇక, మాల్దీవుల్లోని రెండు ప్రతిపక్ష పార్టీలు భారత్ వ్యతిరేక వైఖరిపై ముయిజ్జూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశాయి. మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (MDP), డెమొక్రాట్లు సంయుక్తంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. దేశ విదేశాంగ విధానంలో వచ్చిన మార్పు మాల్దీవులకు ‘అత్యంత హానికరం’ అని వారు అభివర్ణించారు.

ఉప్పల్ టెస్ట్.. టాస్ గెలిచిన ఇంగ్లండ్:
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ ఆరంభం కానుంది. హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ మైదానంలో జరగనున్న ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ ముందుగా బౌలింగ్ చేయనుంది. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో భారత్ బరిలోకి దిగుతోంది. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న విరాట్ కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చినా రజత్ పటిదార్‌కు నిరాశే ఎదురైంది. విరాట్ ఆడే నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ ఆడనున్నాడు. మూడో స్థానములో గిల్, ఐదవ స్థానంలో అయ్యర్ బ్యాటింగ్ చేయనున్నారు. శ్రీకర్ భరత్ కీపర్ కాగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌, రవిచంద్రన్ అశ్విన్లు స్పిన్నర్లు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.