NTV Telugu Site icon

Today Business Headlines 04-04-23: ఫార్మాలోకి నిర్మా. మరిన్ని వార్తలు

Today Business Headlines 04 04 23

Today Business Headlines 04 04 23

Today Business Headlines 04-04-23:

ఈ 35 వేల కోట్లు ఎవరివో?

ఆ డబ్బులు మావి.. అంటూ.. ఎవరూ క్లెయిమ్‌ చేయని డిపాజిట్లు 35 వేల 12 కోట్ల రూపాయలకు చేరాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తమ వద్ద మూలుగుతున్న ఆ సొమ్మును ప్రభుత్వ రంగ బ్యాంకులు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకి బదిలీ చేశాయి. ఫిబ్రవరి నెల వరకు అందుబాటులో ఉన్న ఈ సమాచారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ లోక్‌సభకు వెల్లడించారు. ఈ నగదు 10 కోట్ల 24 లక్షల ఖాతాల్లో ఉండిపోయాయని తెలిపారు. పదేళ్లు.. అంతకుమించి.. యాక్టివ్‌గా లేని డిపాజిట్లను అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లుగా వ్యవహరిస్తారు. ఇలాంటి డిపాజిట్లు అత్యధికంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉండటం విశేషం. వీటి విలువ 8 వేల 86 కోట్ల రూపాయలు.

“సైయెంట్‌”లో మార్పులు

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్‌ సర్వీసుల కంపెనీ సైయెంట్‌ మేనేజ్మెంట్‌లో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. మేనేజింగ్‌ డైరెక్టర్‌ మరియు సీఈఓ బోదనపు కృష్ణకు ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ప్రమోషన్‌ వచ్చింది. దీంతో.. సీఈఓగా కార్తికేయన్‌ నటరాజన్‌ వ్యవహరించనున్నారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కూడా ఈయనే బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రస్తుత సీఎఫ్‌ఓ అజయ్‌ అగర్వాల్‌ రిటైర్‌ అయిన సంగతి తెలిసిందే. అందువల్ల ఆయన ప్లేసులో అట్ల ప్రభాకర్‌ రానున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని సైయెంట్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఫార్మాలోకి.. నిర్మా గ్రూపు

ప్రస్తుతం సబ్బులు, డిటర్జెంట్లు, సిమెంట్‌ బిజినెస్‌ చేస్తున్న నిర్మా గ్రూపు.. ఇప్పుడు.. ఫార్మా రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. బెంగళూరుకు చెందిన స్టెరికాన్‌ అనే ఫార్మా సంస్థను కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కంపెనీ.. కాంటాక్ట్‌ లెన్స్‌ క్లీనింగ్‌ కోసం వాడే సొల్యూషన్లతోపాటు కంటి చుక్కల మందును తయారుచేస్తోంది. అయితే.. ఈ కంపెనీని నిర్మా గ్రూపు ఎంతకు కొనుగోలు చేసిందనే వివరాలు మాత్రం ఇప్పటివరకు వెల్లడికాలేదు. ఔషధ రంగంలోని ఇతర సంస్థలను సైతం కొనుగోలు చేసేందుకు నిర్మా గ్రూపు రెడీగా ఉన్నట్లు ఓ ఇంగ్లిష్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది.

85 డాలర్లకు చమురు ధర

గ్లోబల్‌ మార్కెట్‌లో చమురు ధర మండిపోతోంది. నిన్న సోమవారం ఒక్క రోజే బ్రెంట్‌ రకం క్రూడాయిల్‌ బ్యారెల్‌ రేటు ఎనిమిది శాతం పెరిగింది. తద్వారా 85 డాలర్లకు చేరుకుంది. చమురు ఉత్పత్తిని తగ్గించనున్నట్లు ఒపెక్‌ ప్లస్‌ దేశాలు ప్రకటించిన నేపథ్యంలో ఆయిల్‌ ధర వంద డాలర్లకు చేరొచ్చని అంచనా వేస్తున్నారు. మార్కెట్‌ పరిస్థితులకు తగ్గట్లుగానే చమురు ఉత్పత్తిని తగ్గించినట్లు ఒపెక్‌ ప్లస్‌ దేశాలు చెబుతున్నప్పటికీ వాటి ఉద్దేశం వేరే విధంగా ఉందని నిపుణులు అంటున్నారు. ఆయిల్‌ రేటును వంద డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతోనే అవి పనిచేస్తున్నాయని భావిస్తున్నారు.

వసూళ్లు 16.61 లక్షల కోట్లు

కేంద్ర ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిసింది. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు అంచనాలను మించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 16 పాయింట్‌ ఆరు ఒకటీ లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. మార్చి 31వ తేదీ వరకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిన్న సోమవారం వెల్లడించింది. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు సవరించిన బడ్జెట్‌ అంచనాలను సైతం అధిగమించటం గమనించాల్సిన అంశం. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు పోయినేడాదితో పోల్చితే ఈసారి 18 శాతం వృద్ధి చెందాయి. దీంతో స్థూల వసూళ్లు 19 పాయింట్‌ ఆరు ఎనిమిది లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

2BHK అద్దె నెలకి 50 వేలు

మన దేశంలో హాటెస్ట్‌ రెసిడెన్షియల్‌ రెంటల్‌ మార్కెట్‌గా బెంగళూరు నిలిచింది. అక్కడ రెండు బెడ్‌ రూమ్‌లు, హాల్, కిచెన్‌ కలిగిన ఇంటి అద్దె నెలకి 50 వేల రూపాయలు పలుకుతోంది. అనరాక్‌ అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇండియన్‌ టెక్నాలజీ హబ్‌గా నిలిచిన బెంగళూరులో రెంట్లు 2019తో పోల్చితే రెట్టింపు అయ్యాయి. ఇళ్ల యజమానులు ఈ నగరాన్ని ఇండియాస్‌ సిలికాన్‌ వ్యాలీగా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిటీలో అద్దెలు మిద్దెలను మించుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైని కూడా దాటేశాయి.

Show comments