NTV Telugu Site icon

World’s Best Actors: ప్రపంచ ఉత్తమ నటుల జాబితా విడుదల.. భారత్‌ నుంచి ఒకే ఒక్కరు..

World's Best Actors

World's Best Actors

బ్రిటిష్ ఆన్‌లైన్ వార్తాపత్రిక ది ఇండిపెండెంట్ ఇటీవల 21వ శతాబ్దపు 60 మంది ఉత్తమ నటుల జాబితాను విడుదల చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచంలోని అత్యుత్తమ నటుల జాబితాలో భారతదేశం నుంచి ఒకరి పేరు మాత్రమే చేర్చారు. ఈ జాబితాలో తెలుగు యాక్టర్లు కాదు కదా.. బాలివుడ్‌ సీనియర్ నటులు అమితాబ్ బచ్చన్, షారుక్, సల్మాన్ ఖాన్ కు కూడా చోటు దక్కలేదు. ప్రస్తుతం ఈ లోకంలో లేని.. ఇర్ఫాన్ ఖాన్ ను చేర్చారు.

 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 60 మంది ఉత్తమ నటుల జాబితాలో ఇర్ఫాన్ ఖాన్ పేరు 41వ స్థానంలో ఉంది. ఎంతో కష్టపడి చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న ఇర్ఫాన్ మంచి గుర్తింపు వచ్చేసరికి మన మధ్య లేకపోవడం బాధాకరం. ఏళ్ల శ్రమ అనంతరం.. 2001లో ఆసిఫ్ కపాడియా చిత్రం ది వారియర్‌తో మంచి గుర్తింపు లభించింది. 2003లో హాసిల్, మక్బూల్, ది నేమ్‌సేక్ సినిమాలు అద్భుతమైన నటుడిగా పరిచయం చేసాయి. ఇది కాకుండా అతని సినిమా ఖాతాలో లంచ్‌బాక్స్, స్లమ్‌డాగ్ మిలియనీర్, హైదర్, పాన్ సింగ్ తోమర్ వంటి హిట్ సినిమాలు కూడా ఉన్నాయి.

2020లో ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత..
రాజస్థాన్‌లోని పఠాన్ ముస్లిం కుటుంబంలో 7 జనవరి 1967న జన్మించిన సహబ్జాదే ఇర్ఫాన్ అలీఖాన్‌కు సినిమాలంటే చాలా ఇష్టం. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి నటన నేర్చుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ముంబై వెళ్లిపోయారు. ఇర్ఫాన్ తన కెరీర్‌ను చక్కదిద్దడానికి ఉత్తమ అవకాశాలను పొందుతున్నప్పుడు.. అరుదైన వ్యాధితో బాధపడ్డాడు. నటుడికి న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అనే వ్యాధి సోకింది. చికిత్స కోసం ఇర్ఫాన్ నెలల తరబడి యూకేలోనే ఉన్నాడు. కోలుకుని మళ్లీ తెరపైకి వస్తాడని భావించినా అది కుదరలేదు. యూకేలో చికిత్స అనంతరం ముంబయిలోని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. తను చివరగా నటించిన ‘అంగ్రేజీ మీడియం’ షూటింగ్​లోనూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో కొన్నాళ్లపాటు విరామం తీసుకుని మళ్లీ చిత్రీకరణకు హాజరై, దానిని పూర్తి చేశారు.

29 ఏప్రిల్ 2020 నటుడి మరణం..
29 ఏప్రిల్ 2020 న నటుడి మరణ వార్త అతని కుటుంబంతో పాటు.. అభిమానుల హృదయాలను కలచివేసింది. “నా జీవితంలో ఉన్నట్లుంది ఇలా జరిగింది. ఇలానే ముందుకు సాగాలి. చివరి రోజులు దీనితోనే గడపాలి. నాకు న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అనే వ్యాధి ఉన్నట్లు తేలింది. కానీ నా చుట్టుపక్కల ఉన్న నన్ను ప్రేమించే మనుషులే.. నాకు జీవితంపై ఆశను, జీవించడానికి కావలసిన ధైర్యాన్ని ఇస్తున్నారు” అని అప్పట్లో ఇర్ఫాన్ ట్వీట్ చేశారు.

 

Show comments