TGTET In-Service Teachers 2026: తెలంగాణలో TGTET ఇన్-సర్వీస్ టీచర్స్-2026 పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది. ఈ ఉద్యోగ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో (CBT) పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. పరీక్షల వివరాల్లోకి వెళితే, సెప్టెంబర్ 8న ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు పేపర్-1 పరీక్ష జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు గణితం-సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. తిరిగి సెప్టెంబర్ 9న మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు రెండవ విడత పేపర్-2 పరీక్షలు ఉంటాయి.
ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,983 మంది ఉపాధ్యాయ అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందులో సెప్టెంబర్ 8న జరిగే పేపర్-1 పరీక్షకు 5,963 మంది, అదే రోజు జరిగే పేపర్-2 పరీక్షకు 15,071 మంది మరియు సెప్టెంబర్ 9న జరిగే పేపర్-2 పరీక్షకు 3,949 మంది హాజరుకానున్నారు. ఇక, పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 42 కేంద్రాలను సిద్ధం చేశారు. వీటిలో కేవలం పేపర్-1 పరీక్ష కోసమే 23 కేంద్రాలను కేటాయించారు. అభ్యర్థులు పరీక్షలకు సంబంధించిన పూర్తిస్థాయి వివరణాత్మక షెడ్యూల్, అప్‌డేట్ల కోసం పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను చూడవచ్చని అధికారులు సూచించారు.

