TGSRTC: పెట్రోల్ కష్టాల వేళ గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్టీసీ.. ఆ బస్సుల్లో టికెట్టుపై భారీగా డిస్కౌంట్

Tgsrtc

Tgsrtc

TGSRTC: ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో తలెత్తిన ఇంధన కొరత దృష్ట్యా, నగర వాహనదారులకు ఊరటనిచ్చేలా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్న సామాన్యుడి కష్టాలను గమనించి, సుఖవంతమైన ప్రయాణాన్ని తక్కువ ధరకే అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ పరిధిలోని మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరలపై 30 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు సంస్థ వీసీ & ఎండీ శ్రీ వై. నాగిరెడ్డి, ఐపీఎస్ ప్రకటించారు. ఈ సందర్భంగా “పెట్రోల్ ఇబ్బందులు పడటం ఎందుకు దండగ.. ఆర్టీసీ బస్సులు ఉండగా..!” అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న నాలుగు ప్రధాన ప్రయోజనాలను ఆయన వివరించారు.

READ MORE: RR Captain 2026: రాజస్థాన్ రాయల్స్‌కు కొత్త యాజమాన్యం.. కెప్టెన్‌గా యశస్వి జైస్వాల్‌, నిజమేనా?

పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడి విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని ఎండీ నాగిరెడ్డి సూచించారు. సొంత వాహనాల కోసం గంటల తరబడి వేచి చూసే బదులు, క్షేమంగా, వేగంగా గమ్యస్థానాలకు చేరడానికి ఆర్టీసీ బస్సులే మేలని పేర్కొన్నారు. ఇంధన సంక్షోభం నెలకొన్న తరుణంలో ప్రతి చుక్క పెట్రోల్ విలువైనదే. వ్యక్తిగత వాహనాలను పక్కన పెట్టి ప్రజా రవాణాను ఆశ్రయించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయవచ్చని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తోడ్పడుతుందని ఆయన తెలిపారు. రోడ్లపై వాహనాల రద్దీ తగ్గడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరడమే కాకుండా, కాలుష్యం కూడా తగ్గుతుంది. ముఖ్యంగా ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన కోరారు. సాధారణంగా ఏసీ బస్సులు ఖరీదు అనుకునే వారికి 30% రాయితీ ఒక గొప్ప అవకాశం. పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకుని, అతి తక్కువ ధరకే లగ్జరీ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ఇది సామాన్యుడి జేబుకు, ప్రయాణానికి ఎంతో హాయినిస్తుంది. నగర ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ట్రాఫిక్ మరియు పెట్రోల్ ఇబ్బందుల నుండి బయటపడాలని టీజీఎస్ఆర్టీసీ ఆకాంక్షిస్తోందని ఎండీ నాగిరెడ్డి చెప్పారు.

READ MORE: Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..