Rain In Telangana: చల్లని కబురు చెప్పిన తెలంగాణ వాతావరణ శాఖ.. ఈ జిల్లాల్లో వర్షాలే వర్షాలు..

  • తెలంగాణకు భారీ వర్ష సూచన..
  • మార్చి 15 నుంచి కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ..
  • పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ..
Montha Cyclone Rains

Montha Cyclone Rains

మార్చి నెల ఆరంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం పది గంటలకే ఎండలు మండిపోతుండటంతో.. మధ్యాహ్నం వేళ జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. వేసవి తాపం ఇప్పుడే ఇలా ఉంటే.. ముందు ముందు ఇంకెంత తీవ్రంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్న తరుణంలో.. తెలంగాణ వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి త్వరలోనే విముక్తి లభించనుంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Also Read:National Highway: తెలంగాణ, ఏపీ మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే.. జూన్ నాటికి అందుబాటులోకి..

ఎండల తీవ్రత తగ్గి.. పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మార్చి 14 వరకు ఎండలు ఇలాగే కొనసాగుతాయి. మార్చి 15 నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ప్రారంభమవుతాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30–40 కి.మీ వేగంతో వీచే గాలులతో కూడిన జల్లులు పడవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం వంటి ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది.

Also Read:Telangana: బిగ్ షాక్.. ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు సస్పెండెడ్.. కారణం ఇదే..

మార్చి 16, 17 తేదీల్లో కూడా రాష్ట్రంలోని పలుచోట్ల జల్లులు కురిసే అవకాశం ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ అకాల వర్షాల వల్ల ఎండల నుంచి తాత్కాలికంగా ఉపశమనం లభించినప్పటికీ.. ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.