NTV Telugu Site icon

Damodar Raja Narasimha: 10 రోజుల్లోనే ఉస్మానియా, గాంధీ, కాకతీయ హాస్టల్స్ భవనాలకు శంకుస్థాపన

Damodara Raja Narasimha

Damodara Raja Narasimha

Damodar Raja Narasimha: నేషనల్‌ డాక్టర్స్‌ డే సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుభాకాంక్షలు తెలిపారు. బీసీ రాయ్ చరిత్ర చాలా మందికి తెలియదని.. ఆయన బెంగాల్ రెండో సీఎం అని వెల్లడించారు. మేధావులను దేశానికి ఇచ్చిన రాష్ట్రం అది అని.. అదే కోవకు చెందిన వ్యక్తి బీసీ రాయ్ అని పేర్కొన్నారు. బీసీ రాయ్ జన్మదినం సందర్భంగా డాక్టర్స్‌ డేను జరుపుకుంటారని తెలిపారు. ఆయన ఒక ఆదర్శ మూర్తి అని.. బీసీ రాయ్ పుట్టినరోజు సందర్భంగా డాక్టర్స్ అవార్డు ప్రతి ఏడాది ఇస్తామన్నారు. అత్యంత పవిత్రమైన, అంకితభావంతో నిస్వార్థంగా సేవ చేయడానికి ఎంచుకునేది డాక్టర్ వృత్తి ఆయన వెల్లడించారు.

జూడాల సమ్మె సమయంలో వారి సమస్యలు 80శాతం పరిష్కరించామని మంత్రి తెలిపారు.ఎంతమేరకు ప్రభుత్వం మీ ద్వారా సేవలు ప్రజలకు అందించగలము.. అనేది ఆలోచన చేస్తుందన్నారు. ఉస్మానియా హాస్టల్ బిల్డింగ్ లేదని.. 10 రోజుల్లోనే ఉస్మానియా, గాంధీ, కాకతీయ హాస్టల్స్ భవనాలకు శంకుస్థాపన చేసుకుందామన్నారు. రెండేళ్లలో హాస్టల్స్ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. మౌలిక సదుపాయాలతో పాటు.. హెచ్‌ఆర్ కూడా ముఖ్యమన్నారు. ప్రస్తుతం హెచ్‌ఆర్‌లో ఇన్‌బ్యాలెన్స్ కొనసాగుతోందన్నారు. దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది… కాబట్టి ప్రక్షాళన చేస్తామన్నారు.అదనపు సదుపాయాలతో పాటు క్వాలిటీ మెయింటైన్‌ చేయాలని.. ప్రజలు ఇది నా ఆసుపత్రి అని చెప్పుకునే విధంగా తీర్చిదిద్దాలన్నారు. ఫుడ్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలు వేగవంతంగా చేస్తున్నామని మంత్రి తెలిపారు.

ఆస్పత్రులను 24 అంతస్తులు కట్టడం ముఖ్యం కాదని.. సేవలు ఎలా అందుతున్నాయదే ముఖ్యమన్నారు. టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణాలు కొనసాగుతాయన్నారు. 13 అంతస్తులు అనేది నిబంధన ఉంది.. అందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దాని ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. నిలోఫర్, ఎంఎన్‌జేలకు ఒక ప్రత్యేకత ఉందని.. అలాగే మిగతా వాటికి కూడా ప్రత్యేకత ఉండాలన్నారు. ఇప్పటికే హెచ్ఓడీల ప్రక్షాళన జరుగుతుందన్నారు. హెచ్‌ఓడీలతో సరిగ్గా పని చేయిస్తామని, సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఉస్మానియాను పరిశీలించేందుకు సెక్రటరీని పంపామన్నారు. హెచ్‌ఓడీ పోస్టులు అసలు లేనే లేవన్నారు. వారి స్థానంలో ఇంచార్జీలు పని చేస్తున్నారని తెలిపారు. కేంద్రం నిర్వహించే ఏ పరీక్ష అయినా మేము నిర్వహించుకునే శక్తి ఉందని అని రాష్ట్రాలు అడుగుతున్నాయన్నారు. ఇది కోర్టులో ఉందన్నారు. నీట్‌ను రద్దు చేయాలా, కేంద్రం నిర్వహించాలా, రాష్ట్రాలకు ఇవ్వాలా అనేదానిపై చర్చ జరగాలన్నారు. కొత్త మెడికల్ కాలేజీల కోసం అప్లై చేశామని.. మరిన్ని వస్తాయన్నారు.