Site icon NTV Telugu

CM Revanth Reddy: దేశమంతా సన్నబియ్యం పంపిణీ చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్‌రెడ్డి సూచన..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణలో అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం విజయవంతమైందని.. దేశమంతటా ఈ పథకాన్ని విస్తరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్​ జోషితో తన అభిప్రాయాలను పంచుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని సీఎం వివరించారు. దీంతో పీడీఎస్ బియ్యం రీ సైక్లింగ్ తగ్గిందని, బహిరంగ మార్కెట్లోనూ ధరలు స్థిరపడ్డాయని చెప్పారు. ప్రజలు తినే బియ్యాన్ని పంపిణీ చేయటంతో ఈ పథకం ఆశించిన లక్ష్యం నెరవేరిందని అన్నారు. తెలంగాణలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేసే అంశాన్ని పటిశీలించాలని సీఎం సూచించారు. పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ అంశంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి అన్నారు.

READ MORE: Nara Bhuvaneswari: బాబు బిజీ.. నారా లోకేష్ పెంపకం బాధ్యత నేనే తీసుకున్నా!

గురువారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హోటల్ తాజ్ కృష్ణాలో జరిగిన ఈ సమావేశంలో సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సివిల్ సప్లయిస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ స్టీఫెన్ రవీంద్రతో పాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగిన సహకారం అందించాలని పలు అంశాలను ప్రస్తావించారు. 2024–25 రబీ సీజన్​కు సంబంధించి అదనంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కోటా పెంచాలని కోరారు. పీడిఎస్ కింద సరఫరా చేసిన లెవీ రైస్‌కు సంబంధించిన రూ.1,468 కోట్ల సబ్సిడీ విడుదల చేయాలన్నారు. పీఎంజీకేఏవై అయిదో దశకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ. 343.27 కోట్ల సబ్సిడీ విడుదల చేయాలని కోరారు. 2024–25 ఖరీఫ్ కస్టమ్ మిల్లింగ్ రైస్ వ్యవధి పొడిగించాలని కోరారు. ఎఫ్​సీఐ గోదాముల్లో నిల్వ ఇబ్బందులను అధిగమించేందుకు అదనపు బాయిల్డ్ రైస్ ర్యాక్లు కేటాయించాలని, రాష్ట్రంలో 15 లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల నిల్వ సామర్థ్యం పెంచుకునేందుకు కేంద్రం సాయం అందించాలని కోరారు.

READ MORE: Aadhaar Update: ఆధార్ కార్డు నుంచి ఈ రెండు అదృశ్యం కానున్నాయి..

2025–26 ఖరీఫ్ లో అత్యధికంగా 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని, ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులన్నీ సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్ అవసరం తగ్గిందని, అందువల్ల మిల్లింగ్‌కు అనువైన ముడి బియ్యం రకాల సాగును ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రంలో మిగులు ధాన్యం నిల్వలను సమర్థంగా నిర్వహించేందుకు ఎగుమతి అవకాశాలను పరిశీలించాలని సలహా ఇచ్చారు. ధాన్యం సేకరణ లక్ష్యాన్ని80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచాలని, బాయిల్డ్ రైస్ అదనపు కోటాను కేటాయించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. రా రైస్ కు అనువైన రకాల వరి సాగును ప్రోత్సహించేందుకు రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు.

Exit mobile version