Telangana Degree PG Colleges Bandh: నేడు డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్.. ఎందుకంటే?

Telangana Degree Pg Colleges Band

Telangana Degree Pg Colleges Band

Telangana Degree PG Colleges Bandh: నేడు తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ, పీజీ కళాశాలలు బంద్ కానున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ ప్రైవేటు పీజీ, డిగ్రీ కాలేజెస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (TPDMA) మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. బకాయిలు దీర్ఘకాలంగా విడుదల కాకపోవడంతో రోజువారీ నిర్వహణ ఖర్చులు, విద్యుత్ బిల్లులు మోయడం సవాలుగా మారడమే కాకుండా అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి జీతాలు చెల్లించడం కూడా తీవ్ర భారంగా మారిందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బంద్ మాత్రమే కాకుండా తదుపరి నిరసన కార్యక్రమాలకు కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా బంద్ మరుసటి రోజు రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో మానవహారాలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. ఉన్నతాధికారుల నుంచి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించే వరకు పోరాటాన్ని ఆపేది లేదని తేల్చిచెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా పేద విద్యార్థులకు లబ్ధి చేకూరుతున్నప్పటికీ, నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యం వల్ల కళాశాలల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిల విడుదలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని, అవసరమైతే నిరవధిక సమ్మెకు వెళ్లడానికి కూడా వెనుకాడమని TPDMA హెచ్చరించింది.

మరోవైపు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ సోమవారం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి చేపట్టింది. బారికేడ్లను దాటుకుంటూ, పోలీసుల ఆంక్షలను ఛేదించుకుంటూ పార్టీ కార్యకర్తలు అసెంబ్లీ మెయిన్‌ గేటు వద్ద ఆందోళనకు దిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావుతోపాటు పార్టీ నాయకులు, శ్రేణులు వ్యూహాత్మకంగా అసెంబ్లీ వద్దకు దశలవారీగా చేరుకుని, అసెంబ్లీ ప్రాంగణలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. రాంచందర్‌రావును పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్తున్న క్రమంలో ఆ వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో, మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది.