Site icon NTV Telugu

Telangana CMO: నిర్లక్ష్య ఐఏఎస్‌ల జాబితా సిద్ధం చేస్తున్న సీఎంవో.. అప్రాధాన్య పోస్టులే దిక్కు!

Sam (16)

Sam (16)

ప్రభుత్వంలోని కొందరు ఐఏఎస్‌లపై ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నారా? పనితీరు మెరుగు పరుచుకోవాలని పలుమార్లు సూచించినా ఆ ఐఏఎస్ లు పట్టించుకోవడం లేదా? విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్న ఐఏఎస్‌ల జాబితాను సీఎంవో సిద్ధం చేసిందా? తొందరలోనే ఆ ఐఏఎస్ లకు స్థాన చలనం తప్పదా?.

తెలంగాణ ప్రభుత్వంలోని కొందరు ఐఏఎస్ ల వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వున్నారని సెక్రటేరియట్‌లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు కలెక్టర్లు, సెక్రటరీలు, కమిషనర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. ఐఏఎస్ లు పనితీరు మెరుగు పరుచుకోవాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా… కొందరు ఐఏఎస్ లు పనితీరును మార్చుకోవడం లేదని ముఖ్యమంత్రే స్వయంగా పలువురిని హెచ్చరించారు. అయితే విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్న ఐఏఎస్ ల వివరాలను సీఎంవో అధికారులు సిద్ధం చేసినట్లు సెక్రటేరియట్ లో చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్న ఐఏఎస్ లను ఉపేక్షించరాదని సీఎం సూచించినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధికారుల తీరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని సీఎంవో ఆలస్యంగా గుర్తించింది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండే ఐఏఎస్ లు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పలువురు మంత్రులు తెచ్చారు. దీంతో ఇకపై అలాంటి వారిని అప్రాధాన్య పోస్టులకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కొన్ని పథకాల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం, పథకంపై ప్రజల్లో అనుమానాలు వచ్చేలా ప్రకటనలు చేయడంతో పాటు పలు కారణాలతో అధికారులను దూరం పెట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేస్తున్నా… అధికారులు మాత్రం అందులోని మంచిని ప్రజల్లోకి తీసుకు వెళ్లడం లేదని… పైగా అధికారుల ప్రకటనలు ప్రజలను మరింత గందరగోళ పరిచే విధంగా ఉంటున్నాయని తెలుస్తోంది. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న చర్చ జరుగుతోంది.

తెలంగాణ ఉద్యోగులు, సిబ్బంది సమస్యల పరిష్కారం, పలు శాఖల్లో ఉన్నతాధికారుల నిర్ణయాలు, మంత్రుల ఆదేశాలు, సీఎంవో అధికారుల ఆదేశాలు, ప్రజల విజ్ఞప్తులు పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్న అధికారుల జాబితాను సీఎంవో సిద్ధం చేసింది. వీరితో పాటు సెక్రటేరియట్ లో, హెచ్ఓడి కార్యాలయాల్లో, జిల్లాల్లో పని చేస్తున్న ఐఏఎస్ అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే గ్రేడింగ్ ఇచ్చారు. వారంలో ఒకరోజు ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, గురుకుల సంక్షేమ హాస్టల్స్, ప్రభుత్వ సంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని పదేపదే సీఎం ఆదేశించినా పట్టించుకోని ఐఏఎస్ ల జాబితాను రెడీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్న ఐఏఎస్ లను బదిలీ చేయడమో, ఏ పోస్టు ఇవ్వకుండా జిఎడికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడమో ఖాయమని తెలుస్తోంది.

ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని ఐఏఎస్ ల జాబితా గురించి తెలుసుకునేందుకు సెక్రటేరియట్ లో ఐఏఎస్ లు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు కొందరు ఐఏఎస్ లు కారణాలు వెతుక్కునే పనిలో ఉండగా.. ఎప్పుడు ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే ఆందోళనలో మరికొందరు ఐఏఎస్ లు ఉన్నట్లు సమాచారం.

Exit mobile version