Ghaziabad: ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఎల్ ఈడీ టీవీ పేలడంతో యువకుడు మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌లో ఓమేంద్ర అనే యువకుడు తన తల్లితో కలిసి నివస్తున్నాడు. మంగళవారం రాత్రి సమయంలో టీవీ చూసేందుకు ఆన్ చేయగా ఒక్కసారిగా అది పేలిపోయింది. ఆ సమయంలో తన తల్లి, కోడలు, అతడి స్నేహితుడు ఇంట్లో ఉన్నారు. వారందరికీ తీవ్రంగా గాయాలయ్యాయి.పేలుడు చాలా బలంగా ఉండడంతో ఇంటికి చెందిన కాంక్రీట్ స్లాబ్, గోడలో కొంత భాగం కూలిపోయింది. పేలుడు పెద్ద శబ్ధంతో రావడంతో ఇరుగుపొరుగు వారు భయాందోళనకు గురయ్యారు.
పేలుడు దాటికి పగిలిన టీవీ ముక్కలు ఒమేంద్ర, ముఖం, ఛాతీ మెడపై గాయాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. పెద్ద చప్పుడు రావడంతో సిలిండర్ పేలిందని భావించి సంఘటనా స్థలానికి పరుగున వచ్చినట్లు పక్క ఇంట్లో నివసించే వినీత తెలిపారు. తొలుత ఇంట్లోనుంచి పొగలు రావడం చూశామన్నారు.
Read Also: Garba Dance: గర్బా ఆడుతుండగా రాళ్లతో దాడి.. ఆకతాయిలను కట్టేసి కొట్టిన పోలీసులు
ఎల్‌ఈడీ టీవీ పేలిన సమయంలో ఒమేంద్ర, అతని తల్లి, కోడలు, అతని స్నేహితుడు కరణ్ గదిలో ఉన్నారు. ఒమేంద్ర పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడే చనిపోయాడు. అతని తల్లి, కరణ్ చికిత్స పొందుతున్నారు. పేలుడు జరిగినప్పుడు తాను మరో గదిలో ఉన్నానని మరణించిన యువకుడి కుటుంబ సభ్యులు మోనికా చెప్పారు. పేలుడు చాలా శక్తివంతమైనది, ఇల్లు మొత్తం కదిలింది. గోడ యొక్క భాగాలు కూలిపోయాయని ఆమె చెప్పింది. ఘటనపై విచారణ జరుపుతున్నామని ఘజియాబాద్ పోలీసు అధికారి జ్ఞానేంద్ర సింగ్ తెలిపారు.