ఈ రోజుల్లో ఎంతో మంది యువతకు స్టార్టప్ నిర్మించడం ఒక కల. కానీ, ఇది ఎంతో రిస్క్‌తో కూడిన మార్గం. ఎంత కష్టపడినా కొన్నిసార్లు పరిస్థితులు కలిసిరాకపోతే విజయం దక్కదు. దీనికి నిదర్శనంగా నిలుస్తోంది ఒక ప్రముఖ (టైర్-1) కాలేజీ టెక్ గ్రాడ్యుయేట్ కథ. ఆ యువకుడు ఏటా రూ.45 లక్షల (LPA) భారీ ప్యాకేజీ లభించే ఉద్యోగాన్ని వదులుకుని, రెండు స్టార్టప్‌లను ప్రారంభించాడు. అయితే.. ఆ ప్రయోగం ఘోరంగా విఫలమైంది. దాంతో తన జీవితకాల పొదుపు మొత్తాన్ని కోల్పోయి, మళ్లీ మొదటికొచ్చాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా (Reddit) వేదికగా పంచుకున్నాడు.
“గతేడాది నా కలల స్టార్టప్‌ను నిర్మించడం కోసం మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకున్నాను. ఒకేసారి రెండు కంపెనీలను ప్రారంభించాను. కానీ రెండూ విఫలమయ్యాయి. ఈ రోజు నేను మళ్లీ సున్నా వద్ద నిలబడ్డాను. నా దగ్గర ఎలాంటి పొదుపు లేదు, వ్యాపారం లేదు, నా ప్రయాణాన్ని చెప్పుకోవడానికి సోషల్ మీడియాలో ఎలాంటి గుర్తింపు కూడా లేదు” అని ఆ టెక్ ఫౌండర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆర్థిక నష్టం కంటే కూడా, ఈ వైఫల్యం తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే అత్యంత బాధాకరమైన విషయమని అతడు పేర్కొన్నాడు. ఒకానొక దశలో తనపై తనకే నమ్మకం పోయిందని, అస్సలు తాను కష్టపడ్డానా లేదా అని తనను తానే ప్రశ్నించుకోవడం మొదలుపెట్టానని తెలిపాడు. అంతే కాకుండా.. తనకు ఈ లైఫ్ నచ్చడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం ఎదురైన కష్టాల వల్ల అతడు మళ్లీ ఉద్యోగ అన్వేషణ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. కానీ, ఇంటర్వ్యూలకు హాజరుకావడం అతడికి ఎంతో భయానకంగా అనిపిస్తోంది. “నేను ఇంటర్వ్యూలకు సిద్ధమవ్వాలని అనుకున్న ప్రతిసారీ, ఒకే ఆలోచన నన్ను వెనక్కి లాగుతోంది: ‘నా లాంటి (విఫలమైన) వ్యక్తిని ఏ కంపెనీ ఎందుకు ఉద్యోగంలోకి తీసుకుంటుంది?’ ఈ ఒక్క ఆలోచనే నన్ను ప్రిపరేషన్ కూడా మొదలుపెట్టనివ్వడం లేదు” అని ఆ టెక్ నిపుణుడు తన బాధను పంచుకున్నాడు.

