NTV Telugu Site icon

TDP: నేడు టీడీపీ పొలిట్‌ బ్యూరో భేటీ.. మిషన్ -2029కు ప్రణాళికలు!

Chandrababu

Chandrababu

TDP: ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ కానుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మిషన్ -2029కు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది టీడీపీ. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసే అంశంపై పొలిట్ బ్యూరోలో చర్చించనున్నారు. 2024 ఎన్నికల్లో పార్టీకి పడిన ఓట్లను సుస్థిరం చేసుకునేలా రూపొందించుకోవాల్సిన కార్యాచరణపై పొలిట్ బ్యూరోలో ప్రస్తావించనున్నట్లు సమాచారం. రాష్ట్ర ద్రోహులు రాజకీయాల్లో ఉండకూడదనే నినాదంతో పొలిట్ బ్యూరోలో యాక్షన్ ప్లాన్ సిద్దం చేసే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన నామినేటెడ్ పదవులపై ప్రస్తావించనున్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై టీడీపీ పొలిట్ బ్యూరో ఫోకస్ పెట్టనుంది.

Read Also: Nara Lokesh: రాష్ట్రంలో వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం..

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. దీనికి చంద్రబాబు అధ్యక్షత వహించనున్నారు. నామినేటెడ్ పదవులు, శ్వేత పత్రాలు, సంస్థాగత వ్యవహారాల వంటి ఆరు అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపైనా చర్చిస్తారని సమాచారం. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి పొలిట్ బ్యూరో సమావేశం ఇదే కావడం గమనార్హం.