Afghanistan Pakistan Relations: పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య సంబంధాలు ప్రస్తుతం చాలా ఉద్రిక్తంగా మారాయి. రెండు దేశాల మధ్య మూడుసార్లు శాంతి చర్చలు జరిగిన, అవి విఫలం కావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంతలో ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం పాకిస్థాన్‌తో వాణిజ్యం, ప్రయాణాన్ని నిషేధించాలని ఆదేశించింది. ఆఫ్ఘన్ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి ముల్లా అబ్దుల్ ఘని బరదార్ తాజాగా పాకిస్థాన్‌కు బదులుగా ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలను వెంటనే వెతకాలని ఆఫ్ఘన్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను ఆదేశించారు.
READ ALSO: Bihar exit poll: బీహార్‌లో గెలుపు బీజేపీ కూటమిదే.. యాదవులు, ముస్లింలు తప్పా అంతా ఎన్డీయే వైపే..
ముల్లా అబ్దుల్ ఘని బరదార్ ఏమన్నారంటే..
వాణిజ్య మార్గాలను మూసివేయడం ద్వారా, రాజకీయేతర సమస్యలను రాజకీయ ఆయుధాలుగా మార్చకొని పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్ ఆర్థిక వ్యవస్థను పదే పదే దెబ్బతీసిందని చెప్పారు. కాబట్టి ఇకపై ఆఫ్ఘన్ వ్యాపారులు పాకిస్థాన్‌పై ఆధారపడకూడదని, ఏదైనా సమస్య తలెత్తినప్పుడు తాలిబాన్ ప్రభుత్వం నుంచి సహాయం ఆశించాలని ఆయన స్పష్టం చేశారు. జాతీయ గౌరవం, ఆర్థిక ప్రయోజనాలు, పౌరుల హక్కులను కాపాడటానికి, ఆఫ్ఘన్ వ్యాపారులు పాకిస్థాన్‌తో వాణిజ్యాన్ని తగ్గించుకుని, ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలను వెతకాలని బరాదర్ వెల్లడించారు. ముఖ్యంగా పాకిస్థాన్ నుంచి ఔషధాల దిగుమతి గురించి ఆయన నొక్కి చెప్పారు. ఇవి తక్కువ నాణ్యత కలిగి ఉన్నాయని, అయినా వీటి కోసం ఏటా వందల మిలియన్ల డాలర్లు ఖర్చవుతాయని, కాబట్టి అన్ని ఔషధ దిగుమతులు ఇతర దేశాల నుంచి తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
పాకిస్థాన్‌లో ఇప్పటికే కాంట్రాక్టులు కలిగి ఉన్న వ్యాపారులు తమ ఖాతాలను మూసివేసి, వ్యాపారాలను ముగించుకోవడానికి మూడు నెలల సమయం ఇచ్చారు. ఆ తర్వాత ఎటువంటి మినహాయింపులు ఇవ్వడం ఉండదని ఆయన స్పష్టం చేశారు. 2025 అక్టోబర్ నుంచి కొనసాగుతున్న ఈ ఉద్రిక్తతల మధ్య తాలిబన్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్‌లో పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య సరిహద్దులో తీవ్ర ఘర్షణలు చెలరేగాయి, ఈ ఘర్షణల కారణంగా ఇరువైపులా డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP)కి ఆఫ్ఘనిస్థాన్ భద్రతను కల్పిస్తోందని ఆరోపిస్తూ పాకిస్థాన్ సరిహద్దును మూసివేసి, రవాణా వాణిజ్యాన్ని నిలిపివేసింది. దీనివల్ల వేలాది ట్రక్కులు నిలిచిపోయాయి, అలాగే రెండు దేశాల వ్యాపారులకు మిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది. ఇంతలో టర్కీ – ఖతార్ మధ్యవర్తిత్వంతో రెండు రౌండ్ల చర్చలు జరిగాయి. కానీ నవంబర్‌లో ఇస్తాంబుల్‌లో మూడవ రౌండ్ చర్చలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఎందుకంటే పాకిస్థాన్ TTPకి వ్యతిరేకంగా వ్రాతపూర్వక హామీలను డిమాండ్ చేస్తూ ఉంది. దీనిని తాలిబాన్ తన సార్వభౌమాధికారంపై దాడిగా అభివర్ణించింది.
ఈ క్రమంలో టోర్ఖం, స్పిన్ బోల్డాక్ వంటి కీలక సరిహద్దు క్రాసింగ్‌లు మూసి వేయడం గమనించదగ్గ విషయం. దీని వలన ఆఫ్ఘనిస్థాన్‌లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఎగుమతులపై ప్రభావం కనిపిస్తుంది. పాకిస్థాన్ ఒత్తిడి వ్యూహాలను ఎదుర్కోవడానికి తాలిబన్లు ఇప్పుడు ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవు లేదా ఇతర మార్గాలను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తంమీద ఆఫ్ఘన్ తాజా చర్య పాకిస్థాన్‌పై తాలిబన్ల ఆర్థిక ప్రతీకార చర్యగా నిలుస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Delhi Blast: ఢిల్లీ పేలుళ్లలో రెండవ మహిళా ఉగ్రవాది.. అఫిరా బీబీ ఎవరు?
