Supreme Court Judgment: ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న ఉద్యోగి అరెస్ట్ అయి 48 గంటలకు పైగా జుడీషియల్ కస్టడీలో ఉన్నట్లయితే వారు సస్పెండ్ అయినట్లేనని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. దీనిపై ప్రత్యేకంగా ఉత్తర్వు ఇవ్వాల్సిన అవసరం లేదని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం పేర్కొంది. బీహార్ లోని సమస్తిపూర్ సదర్ ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ విశ్వజిత్ సింగ్ కు పాట్నా హైకోర్టు రద్దు చేసిన బెయిలును పునరుద్ధరిస్తూ ఈ విషయం వెల్లడించింది.
ఓ కాంట్రాక్టు ఉద్యోగికి పెండింగ్ వేతనాన్ని మంజూరు చేసేందుకు రూ. 4000 లంచంగా డిమాండ్ చేయడంతో విశ్వజిత్ సింగ్ పై కేసు నమోదైంది. ఈ లంచం చిన్న మొత్తమేనని పేర్కొంటూ సెషన్స్ కోర్ట్ నిందితుడికి బెయిల్ ఇవ్వడాన్ని ఫిర్యాదుదారు హైకోర్టులో సవాల్ చేశారు. మంజూరైన బెయిలును ఏడాది తర్వాత పాట్నా హైకోర్ట్ రద్దు చేయడంతో నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
దీనితో బెయిల్ పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్ట్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 48 గంటలకు పైగా జుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుడిపై సస్పెన్షన్ తొలగించడంతో పాటు అదే ఆస్పత్రిలో అదే హోదాలో నియమించడాన్ని ప్రశ్నించింది. నిందితుడు 15 రోజులకు పైగా జుడీషియల్ కస్టడీలో ఉన్నందున ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడానికి ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదని గుర్తు చేసింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

