పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ‘సర్’కు చెందిన అధికారులను దిగ్బంధించడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా మందలించింది. ఇదంతా పక్కా ప్రణాళికతో చేసిన కుట్రగా సుప్రీంకోర్టు అభివర్ణించింది. దీంతో బెంగాల్ ప్రభుత్వంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
బెంగాల్‌లోని మాల్దాలో న్యాయాధికారులను దిగ్బంధించి దాడులు జరిగినట్లుగా వచ్చిన వార్తలు తీవ్ర కలకలం రేపాయి. బుధవారం మధ్యాహ్నం నుంచి అధికారులను బంధించి తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు న్యాయస్థానం దృష్టికి వచ్చింది. దీంతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తీవ్రంగా పరిగణించారు.
పశ్చిమ బెంగాల్‌లో న్యాయాధికారులను బందీలుగా పట్టుకోవడంపై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ సుమోటోగా స్వీకరించారు. ముట్టడికి గురైన న్యాయాధికారి ఐదేళ్ల బిడ్డ కూడా ఇంట్లోనే ఉండటంతో తాను నిన్న రాత్రి కఠినమైన ఉత్తర్వులు జారీ చేయక తప్పలేదని.. ఆ తర్వాతే యంత్రాంగం చర్యలు తీసుకుందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. దేశంలోనే ‘‘అత్యంత ధ్రువణమైన’ రాష్ట్రంగా అభివర్ణించారు. ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమైన అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ‘ముందస్తుగా ఆలోచించి, లెక్కించి, ఉద్దేశపూర్వకంగా’’ చేసిన కుట్రగా ధర్మాసనం పేర్కొంది.
పశ్చిమ బెంగాల్ అడ్వకేట్ జనరల్‌ను ఉద్దేశించి సూర్యకాంత్ మాట్లాడుతూ.. ‘‘దురదృష్టవశాత్తు మీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నారు. అల్లరి మూకలు ఎవరో మాకు తెలియదని మీరు అనుకుంటున్నారా? నేను తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నాను. ఇది చాలా దురదృష్టకరం.’’ అని వ్యాఖ్యానించారు. ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ అధికారులను సురక్షితంగా తరలించడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం కార్యదర్శి, డీజీపీ, జిల్లా మేజిస్ట్రేట్‌లతో సహా రాష్ట్రంలోని ఉన్నతాధికారులను ప్రధాన న్యాయమూర్తి మందలించారు.
‘‘బుధవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో న్యాయాధికారుల ముట్టడి ప్రారంభమైందని ధర్మాసనం తన ఉత్తర్వులో పేర్కొంది. రిజిస్ట్రార్ జనరల్ పరిపాలనా అధికార యంత్రాంగానికి సమాచారం అందించి.. తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రాత్రి 8:30 గంటల వరకు ఏమీ చేయలేదు. ఆ సమయంలో హోం సెక్రటరీని సంప్రదించాం. డీజీపీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో గ్రూప్ కాల్ నిర్వహించాం. తక్షణ చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ఎటువంటి నిర్దిష్ట చర్య తీసుకోలేదు.’’ అని ధర్మాసనం తెలిపింది.
‘‘కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక లేఖలో.. జిల్లా మేజిస్ట్రేట్ గానీ, పోలీసు సూపరింటెండెంట్ గానీ సంఘటనా స్థలానికి చేరుకోలేదని పేర్కొన్నారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ), హోం సెక్రటరీని పిలిపించాల్సి వచ్చింది.’’ అని సీజేఐ అన్నారు.
‘‘బుధవారం జరిగిన సంఘటనపై కోర్టు అధికారాన్ని సవాలు చేసేందుకు జరిగిన చర్య సిగ్గుమాలిన ప్రయత్నం. న్యాయాధికారులను నిరుత్సాహపరిచి.. ప్రక్రియను అడ్డుకోవడానికి ఇది పక్కా ప్రణాళికతో చేసిన ఎత్తుగడ. ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హోం కార్యదర్శిల ప్రవర్తన పూర్తిగా ఖండనీయం.’’ అని సూర్యకాంత్ అన్నారు.
అధికారులను దిగ్బంధించడంపై బీజేపీ నేత అమిత్ మాల్వీయ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు.
