Site icon NTV Telugu

RajiniKanth: రాజకీయాల్లోకి రజినీ ఎంట్రీ ఇస్తారా?.. ఆయన ఏమన్నారంటే?

Rajinikanth

Rajinikanth

RajiniKanth: సూపర్ స్టార్ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. రజనీకాంత్ నేడు తమిళనాడు గవర్నర్‌తో సమావేశం కావడమే. ఈ నేపథ్యంలో రజనీ మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయం గురించి మీడియా సూపర్‌స్టార్‌ను ప్రశ్నించగా.. అలాంటి ఆలోచనే లేదని మరోసారి స్పష్టం చేశారు.

సూపర్‌స్టార్ రజినీ కాంత్ రాజకీయాల్లోకి మళ్లీ ఎంట్రీపై తన అభిప్రాయం ఏమిటనేది మరోసారి తేల్చిచెప్పారు. సోమవారం ఆయన చెన్నైలోని రాజ్‌భవన్‌లో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో సమావేశమయ్యారు. ఈ ఉదయం చెన్నైలోని రాజ్‌భవన్‌కు వెళ్లిన రజనీకాంత్ దాదాపు అరగంట పాటు గవర్నర్‌తో చర్చించారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు మళ్లీ ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ భేటీ అనంతరం రజనీ మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. భేటీలో భాగంగా తాము రాజకీయాల గురించి కూడా చర్చించామని, అయితే ఆ వివరాలను తాను వెల్లడించలేనని అన్నారు. దీంతో భవిష్యత్తులో మీరు రాజకీయాల్లోకి రాబోతున్నారా? అని మీడియా ఆయన్ను ప్రశ్నించింది. అయితే రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన తనకు లేదని రజనీ తెలిపారు.

Maharashtra Cabinet: మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్!

పాలు, పెరుగు వంటి ఆహార ఉత్ప‌త్తుల‌పై జీఎస్టీ విధించ‌డంపై స్పందించ‌డానికి ర‌జనీకాంత్ నిరాక‌రించారు. త్వర‌లో రానున్న సినిమా కోసం ఈ నెల 15 లేదా 22న షూటింగ్ జ‌రుగుతుంద‌న్నారు. సినీ నిర్మాత నెల్సన్ దిలీప్ కుమార్‌తో క‌లిసి `జైల‌ర్‌` సినిమా కోసం రజినీకాంత్ ప‌ని చేస్తారు. క‌న్నడ సినీ న‌టుడు శివ్‌రాజ్ కుమార్ కీల‌క పాత్రలో న‌టిస్తార‌న్నారు. కొన్ని నెల‌ల క్రితం స‌న్ పిక్చర్స్ `జైల‌ర్‌` టైటిల్ పోస్టర్‌ను విడుద‌ల చేసింది. 2017లో రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన చేశారు. రాజకీయ పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. కొన్నేళ్ల పాటు ఆ దిశగా ప్రయత్నాలు చేసిన ఆయన.. 2020 డిసెంబరులో ఆ ఆలోచనను విరమించుకున్నారు. కొవిడ్ పరిస్థితులు‌, అనారోగ్య సమస్యల కారణంగా ఆయన రాజకీయాల్లోకి రావట్లేదంటూ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version