New Scheme : ఊరు చిన్నదే అయినా.. ఆ గ్రామస్తుల మనసు చాలా పెద్దది . ఎంత పెద్దదంటే తమ పల్లెలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఆర్థిక చేయూత అందించేంత ఎత్తుకు ఎదిగారు. ఇప్పటికీ ఎంతోమంది ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావిస్తున్నారు. పెళ్లీడుకు వస్తున్న అమ్మాయిని చూసి గుండె మీద కుంపటిలా చూస్తున్నారు. అప్పులు చేసి మరీ ఆడబిడ్డ పెండ్లి చేస్తున్నారు. కానీ ఊరిలో ఆడపిల్ల పుడితే ఇంట్లో వాళ్లే కాదు ఊరంతా సంబరపడుతోంది. కుమార్తె పుట్టడం వరమంటున్నారు డిచ్‌పల్లి మండలం వాసులు. కారణం వారి సర్పంచ్ పానుగంటి రూప. తల్లిదండ్రుల్లో భయాన్ని దూరం చేసి అభయం ఇచ్చేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆడపిల్ల పుడితే రూ.5 వేల బాండ్ ఇస్తానని సుద్దపల్లి సర్పంచి రూప ప్రకటించారు. గ్రామంలో ఈ నెల 5 నుంచి ఏడాది పాటు అమలు చేస్తామన్నారు.
Read Also: Earthquake : మణిపూర్ లో భూకంపం.. భయంతో జనం పరుగులు
ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటంటే.. ఆడపిల్లల జననం తక్కువగా ఉంటుందని, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతోపాటు తనవంతుగా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రూప చెబుతున్నారు. గ్రామ పంచాయతీలో రికార్డులను పరిశీలించగా.. ఏటా 20లోపు మాత్రమే ఆడపిల్లలకు సంబంధించిన జనన ధ్రువపత్రాలు తీసుకుంటున్నారని గుర్తించారు. గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చదివించేలా ప్రోత్సహించేందుకు సర్పంచి దంపతులు రూప- సతీష్‌రెడ్డి మొదటి అడుగు వేశారు. తమ పిల్లలు యోగితారెడ్డి(9వ తరగతి), రక్షితరెడ్డి(6వ తరగతి)ని స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నారు.