Student : తల్లి, తండ్రి తరువాతి స్థానం గురువు అంటారు. గురువును కూడా దేవుడితో సమానంగా పూజించాలంటారు. అందుకే ఆచార్య దేవో భవ అని పెద్దలు అన్నారు. గురువును పూజించడం అట్లుంచితే అసలు తన ఉన్నత స్థానానికి కూడా గుర్తింపులేకుండా పోయింది. టీచర్ అంటేనే విద్యార్థులకు చిన్న చూపైపోయింది. ఇందతా సినిమాల ప్రభావమా లేక పరిస్థితుల ప్రభావమో చెప్పడం కష్టం. రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలో స్కూల్ నుంచి బహిష్కరించినందుకు ఒక విద్యార్థి కక్షగట్టి టీచర్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. 16 ఏళ్ల విద్యార్థి స్కూల్‌లో అల్లరి పనులు చేస్తూ అందరి పట్ల చాలా దురుసుగా ప్రవర్తించేవాడు. టీచర్ శివచరణ్ సైన్(54) చాలాసార్లు అతడిని ఇది పద్ధతి కాదంటూ హెచ్చరించాడు. అయినప్పటికీ ఆ విద్యార్థి ప్రవర్తనలో మార్పు రాలేదు. అయితే స్కూల్‌లో చదువుతున్న విద్యార్థినితో అతడి ప్రేమ వ్యవహారం బయటపడింది. ఈ నేపథ్యంలో ఆ స్టూడెంట్‌ను టీచర్ స్కూల్ నుంచి బహిష్కరించారు.
Read Also: Saree Walkathon : సూరత్ లో ‘శారీ వాకథాన్’.. చీరలో ముద్దుగా ముద్దుగుమ్మలు
కాగా, స్కూల్ బహిష్కరణకు కారణమైన టీచర్ శివచరణ్‌పై ఆ విద్యార్థి కక్షగట్టాడు. అతడిని ఎలాగైనా మట్టుపెట్టాలని మాస్టర్ ప్లాన్ వేశాడు. మంగళవారం స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న టీచర్‌ను తన ఇద్దరు స్నేహితులతో కలిసి అడ్డుకున్నాడు. ఆ టీచర్‌ను కత్తితో పలుమార్లు పొడిచి బైక్‌పై పారిపోయాడు. దీంతో ఉపాధ్యాయుడు శివచరణ్ రోడ్డుపై కుప్పకూలి మరణించాడు. మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరకున్నారు. టీచర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడైన మైనర్ బాలుడ్ని అరెస్ట్ చేశారు. టీచర్ హత్యకు వినియోగించిన కత్తి, సుత్తిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, హత్యకు గురైన టీచర్ శివచరణ్ ప్రముఖ కవి, అవార్డు గెలుచుకున్న ఉపాధ్యాయుడని పోలీసులు తెలిపారు.