నేటి నుంచి వరంగల్ నిట్‌లో ‘స్ప్రింగ్ స్ప్రీ 25’ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు (మార్చి రెండవ తేదీ వరకు) వసంతోత్సవాలు కొనసాగనున్నాయి. వసంతోత్సవాలను ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ప్రారంభించనున్నారు. ఈ కల్చరల్ ఫెస్ట్ పలు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొననున్నారు. స్ప్రింగ్ స్ప్రీ 25 కోసం విద్యార్థులు వరంగల్ నిట్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం నిట్ కళకళలాడుతోంది.
వరంగల్ నిట్‌లో ప్రతీ ఏడాది విద్యార్థులే నిర్వాహకులుగా మూడు రోజులు వసంతోత్సవాలను నిర్వహించనున్నారు. నిట్‌లో దేశం, ప్రపంచంలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వంలా నిలుస్తున్న నిట్‌లో.. వివిధ దేశాల సంస్కృతీసంప్రదాయలను పరస్పరం పంచుకునేందుకు 1978లో వసంతోత్సవం ప్రారంభమైంది. ఈ వసంతోత్సవం దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద కల్చరల్ ఫెస్ట్‌గా పేరుగాంచింది. దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు ఫెస్ట్‌లో పాల్గొననున్నారు. నిట్‌లో మూడు రోజులపాటు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో స్ప్రింగ్ స్ప్రీ 25 ఉత్సవాలు జరగనున్నాయి.