Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పాటు చెన్నైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వర్షాల తీవ్రతను బట్టి.. ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలెర్ట్‌లు జారీ చేసింది భారత వాతావరణ శాఖ.. ఇప్పటికే తీరాన్ని తాకింది మిచౌంగ్.. మరో రెండు గంటల్లో పూర్తిగా తీరాన్ని దాటనుంది.. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 90-110 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.. తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.. ఈ రోజు కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. పలుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ తీవ్రస్థాయిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ప్రకటించింది.. మరోవైపు.. తుఫాన్ తీవ్రత దృష్ట్యా ముందుగానే అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే ఏకంగా 300 రైళ్లను రద్దు చేసింది.. ఇదే సమయంలో.. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్టు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో రాకేష్ వెల్లడించారు.
Read Also: Chandigarh: పంజాబ్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది సహచరుడి అరెస్టు
మిచౌంగ్ తుఫాన్ కారణంగా రైళ్ల రద్దుపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో రాకేష్.. తుఫాన్ కారణంగా 300 రైళ్లు రద్దు చేశాం.. మరో 10 రైళ్లు గూడూరు – చెన్నై మధ్య కాకుండా ఇతరత్రా రూట్లలో దారి మళ్లిస్తున్నాం అన్నారు. ప్రస్తుతం ఎక్కడ కూడా రైల్వే ట్రాక్ లపై నీళ్లు నిలవలేదని.. వరద నిలిచే ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించాం.. అందుకు స్పెషల్ టీమ్స్ పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైళ్ల రద్దు సమచారం అందించాం.. ఎస్ఎంఎస్ లు, సామాజిక మాధ్యమాలలో కూడా సమాచారం చేరవేశామని.. ప్రయాణికుల రిజర్వేషన్ ఛార్జీలు రీఫండ్ చేశామని తెలిపారు. వాతావరణ శాఖ ఇచ్చిన అలెర్ట్ మేరకు రేపటి వరకు ఈ రైళ్లు రద్దు కొనసాగుతోంది.. కానీ, ఒకవేళ వాతావరణం ఇలాగే ఉంటే రద్దు పొడిగించే అవకాశం కూడా ఉంటుందన్నారు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో రాకేష్.
