న్యూజిలాండ్‌తో జరిగిన వెల్లింగ్టన్ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన తర్వాత భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జట్టు ఎంపికపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. నిపుణులైన స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ ఇద్దరిలో ఒక్కరు కూడా జట్టులో ఎందుకు లేరని ఆయన నేరుగా ప్రశ్నించారు. విదేశాల్లో చదునైన పిచ్‌లపై టెస్ట్ మ్యాచ్‌లు గెలవాలంటే అత్యుత్తమ స్పిన్నర్ అవసరం తప్పనిసరి అని గంగూలీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. వైట్ బాల్, రెడ్ బాల్ క్రికెట్‌లో భారత్ అద్భుతంగా ఆడుతోందని, బ్యాటర్లు అమోఘమైన సహకారం అందించారని ప్రశంసిస్తూనే, ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ ఆడగలిగినప్పటికీ కుల్దీప్ లేదా మానవ్ సుతార్ ఎక్కడ ఉన్నారని నిలదీశారు. వాస్తవానికి ప్రారంభంలో టెస్ట్ జట్టులో ఉన్న కుల్దీప్ స్థానంలో రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు అన్షుల్ కాంబోజ్‌ను చేర్చారు. మూడు టెస్టుల్లో 23 వికెట్లు తీసిన మానవ్ సుతార్‌కు 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కలేదు. దీంతో భారత జట్టులో వాషింగ్టన్ సుందర్ మాత్రమే ఏకైక స్పిన్నర్‌గా ఉన్నారు.
ఈ డ్రా మ్యాచ్‌పై భారత మాజీ స్పిన్నర్ ఆర్. అశ్విన్, మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చివరి 15 ఓవర్లు కూడా బౌలింగ్ చేసి ఫలితం సాధించేందుకు ప్రయత్నించి ఉండాల్సిందని అశ్విన్ అన్నారు. ఐదు వికెట్లు తీయాల్సి ఉన్నప్పటికీ ప్రయత్నించి ఉండాల్సిందని, ఏదైనా జరిగేదని, విజయం కోసం మరింత ఉత్సాహం చూపి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్‌ల ఆటతీరును ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసిస్తూ, ఇద్దరూ కలిసి 300కు పైగా బంతులు ఆడటం ఆ భాగస్వామ్యం ఎంత కీలకమైనదో నిరూపిస్తోందని పేర్కొన్నారు.
నవంబర్ 19 గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 368 పరుగులు చేయగా, భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 720 పరుగుల భారీ స్కోరు సాధించి 352 పరుగుల ఆధిక్యం సంపాదించింది. మ్యాచ్ కాపాడుకోవడానికి చివరి రోజు ఆడిన కివీస్ జట్టు, రెండో ఇన్నింగ్స్‌లో 120 ఓవర్లు ఆడి 5 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. ఐదో రోజు ఆరవ వికెట్‌కు గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్‌ల భాగస్వామ్యాన్ని భారత బౌలర్లు విడదీయలేకపోయారు. చివరకు 15 ఓవర్లు మిగిలి ఉండగానే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కివీస్ కెప్టెన్‌తో కరచాలనం చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించేందుకు అంగీకరించాడు.

