ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం చోటుచేసుకుని 72 గంటలు (మూడు రోజులు) గడుస్తున్నా.. సహాయచర్యల్లో పెద్దగా పురోగతి లేదు. టన్నెల్‌లో గల్లంతైన ఎనిమిది మంది ఆచూకీపై ఇప్పటికి క్లారిటీ రాలేదు. రెస్క్యూ టీమ్స్ పలుమార్లు టన్నెల్‌లోకి వెళ్లి.. ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తిరిగి వచ్చాయి. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎల్ అండ్ టీ టన్నెల్ నిపుణులు, రాబిన్స్ కంపెనీ ఇంజనీర్లు, జియాలజి నిపుణులు సహాయ చర్యల్లో ఉన్నా.. ఫలితం లేదు. టన్నెల్‌లో పూర్తిగా ప్రతికూల పరిస్థితులే ఉన్నాయని రెస్క్యూ బృందాలు ఉన్నతాధికారులకు వివరించాయి.
టీబీఎం మిషన్ సహాయ చర్యలకు అడ్డంకిగా మారింది. మిషన్ వెనకాల పెద్ద ఎత్తున మట్టి, బురద ఉండడంతో రెస్క్యూ బృందాలు ముందుకు వెళ్లలేకపోతున్నాయి. టీబీఎం మిషన్‌ను కదిలిస్తే.. పైకప్పు మరోసారి కుప్పకూలే అవకాశం ఉందని ఇంజనీర్లు అంటున్నారు. టన్నెల్‌లో 13.452 కిలోమీటర్ల తరువాత సీపేజ్ జోన్, డేంజర్ జోన్ ఉన్నట్లు ఇంజనీర్లు చెబుతున్నారు. రెస్క్యూ బృందాలు టీబీఎం మిషన్ దాటి ముందుకు వెళ్లేందుకు సాహసం చేయలేకపోతున్నాయి. టన్నెల్ వద్దకు 8 మంది కుటుంబ సభ్యులు చేరుకున్నారు. తమ వారిని కాపాడాలంటూ అధికారులను వేడుకుంటున్నారు.
మరికాసేపట్లో రెస్క్యూ బృందాలు, ఇంజనీర్లు, నిపుణులతో కలెక్టర్, ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. డీ వాటరింగ్ కోసం మేఘా కంపెనీ నుండి పెద్ద మోటార్లు తెప్పించే యోచనలో అధికారులు ఉన్నారు. బురదను బయటకు తీసేందుకు ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టారు. ఎల్ అండ్ టీ, మేఘా ఇంజనీర్లు, నిపుణుల సహకారంను అధికారులు కోరారు. ఆ జోన్లో రెస్క్యూ మరింత ప్రమాదం అని రాబిన్స్ కంపెనీ ఇంజనీర్లు అంటున్నారు.