Shreyas Iyer: ఓపెనర్ల ఆట చూసి ఆశ్చర్యం వేసింది.. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు..

Shreyas Iyer Toss Record

Shreyas Iyer Toss Record

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మరొక రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయంపై శ్రేయస్ అయ్యర్ మాట్లాడారు. ఓపెనర్లు ఆడిన తీరు కళ్లకు విందుగా ఉందని, వారి షాట్లు అద్భుతంగా ఉన్నాయని అయ్యర్ చెప్పారు. తాను, సంజూ శాంసన్ బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు బంతి బాగా సీమ్ (స్వింగ్) అయిందని, అలాంటి సమయంలో ఓపెనర్లు అంత వేగంగా ఎలా ఆడారో చూసి ఆశ్చర్యం వేసిందన్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం 5 ఓవర్లలోనే 100 పరుగులు చేయడం తాను ముందెప్పుడూ చూడలేదని కొనియాడారు. విదేశీ పర్యటనల్లో విభిన్న పరిస్థితులు, సవాళ్లు ఎదురవుతాయని, ప్రయాణ అలసట ఉన్నప్పటికీ ఆటగాళ్లు చూపించిన ప్రతిభ నిజంగా ప్రశంసనీయమని తెలిపారు. ఇక బౌలింగ్ వ్యూహం గురించి చెబుతూ.. 10 ఓవర్ల తర్వాత పిచ్‌పై హార్డ్ లెంగ్త్ బంతులు వేస్తే అవి సిక్సర్లుగా వెళ్తున్నాయని గ్రహించానని వివరించారు. అందుకే బౌలర్లను వరుసగా యార్కర్లు లేదా వైడ్ యార్కర్లు వేయమని సూచించినట్లు తెలిపారు. ఈ వ్యూహం సరిగ్గా అమలై రన్ రేట్‌ను తగ్గించగలిగామని, దాంతో న్యూజిలాండ్‌ను 200 పరుగుల లోపే కట్టడి చేయాలనే లక్ష్యం నెరవేరిందని పేర్కొన్నారు.

మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 13.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 38 బంతుల్లోనే 113 పరుగులు చేసి సంచలన శతకంతో చెలరేగాడు. ఈ విజయంతో మరొక రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే భారత్ టి20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. అభిషేక్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.