Shinzo Abe Assassination Case Verdict Today: జపాన్ ప్రజలను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసిన మాజీ ప్రధాని షింజో అబే హత్య కేసులో ఇప్పుడు కీలక ఘట్టం రాబోతోంది. మూడున్నరేళ్ల క్రితం దేశాన్ని కుదిపేసిన ఆ కాల్పుల ఘటనపై బుధవారం జపాన్ కోర్టు తీర్పు చెప్పనుంది. దేశంలోనే ఎక్కువకాలం ప్రధానిగా పనిచేసిన నాయకుడిని ఇలా బహిరంగ సభలో హత్య చేయడం జపాన్ చరిత్రలోనే అరుదైన ఘటనగా నిలిచింది. 2022 జూలైలో నారా నగరంలో ఎన్నికల ప్రచార సభ జరుగుతోంది. అబే ప్రసంగం ఇస్తుండగా.. ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. చేతితో తయారు చేసిన తుపాకీతో టెట్సుయా యమగామి అనే వ్యక్తి అబేపై కాల్పులు జరిపాడు. అప్పటికప్పుడు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే 67 ఏళ్ల అబే తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో షింజో ప్రధానమంత్రి కాకపోయినా, అధికార పార్టీ లిబరల్ డెమోక్రాటిక్ పార్టీలో ఆయన మాటకు చాలా బలం ఉండేది.
READ MORE: JD Vance: గుడ్‌న్యూస్ చెప్పిన జేడీ వాన్స్ దంపతులు
అబే మరణంతో ఆ పార్టీ ఒక్కసారిగా దిశ తప్పింది. ఆయన లేని లోటు ఇప్పటికీ కనిపిస్తోంది. అప్పటి నుంచి పార్టీకి రెండు సార్లు నాయకత్వ మార్పులు జరిగాయి. ప్రధానమంత్రి పదవిలోనూ స్థిరత్వం తగ్గింది. అబే రెండు విడతలుగా మొత్తం 3,188 రోజులు ప్రధానిగా పనిచేశారు. ఆరోగ్య కారణాల వల్ల 2020లో పదవి నుంచి తప్పుకొన్నారు. ప్రస్తుతం ఆయన శిష్యురాలిగా భావించే సనాయే తకాఇచి దేశాన్ని, పార్టీని నడిపిస్తున్నా, ఎల్‌డీపీకి ఉన్న పట్టు మాత్రం బాగా తగ్గిపోయింది. ఈ హత్య మరో పెద్ద విషయం బయటకు వచ్చింది. అదే ఎల్‌డీపీకి యూనిఫికేషన్ చర్చ్ అనే సంస్థతో ఉన్న బంధం. చాలామంది దీనిని ఒక రకమైన మతసంస్థగా కాకుండా కల్ట్‌గా చూస్తారు. పార్టీ లోపలి విచారణలో వంద మందికి పైగా ఎంపీలు ఆ సంస్థతో ఏదో రూపంలో సంబంధాలు పెట్టుకున్నట్టు తేలింది. దీంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగి, ఎల్‌డీపీపై నమ్మకం తగ్గింది.
READ MORE: 7,000mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరాతో Oppo A6 5G లాంచ్.. ధర ఎంతంటే..?
కోర్టులో యమగామి చెప్పిన మాటలు కూడా అందరినీ ఆలోచింపజేశాయి. తన తల్లి యూనిఫికేషన్ చర్చ్‌కు భారీగా విరాళాలు ఇవ్వడం వల్ల తమ కుటుంబం ఆర్థికంగా కష్టాల్లో పడిందని వాదించాడు. ఆ కోపమే తనలో పేరుకుపోయిందని, ఆ సంస్థతో సంబంధం ఉందని భావించిన అబేపై ఆగ్రహం చూపించానని చెప్పాడు. అబే ఒకసారి ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న కార్యక్రమానికి వీడియో సందేశం పంపిన విషయాన్ని కూడా అతను ప్రస్తావించాడు. దక్షిణ కొరియాలో 1954లో ప్రారంభమైన ఈ చర్చ్, పెద్ద ఎత్తున పెళ్లిళ్ల కార్యక్రమాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. జపాన్ నుంచి వచ్చే విరాళాలే దానికి ప్రధాన ఆదాయ వనరు అని కూడా చెబుతారు. యమగామి కోర్టులో తొలిసారి హాజరైనప్పుడే అబేను తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. అందుకే అతను దోషి అన్న విషయంలో పెద్దగా సందేహాలు లేవు. ఇప్పుడు అందరి దృష్టి శిక్ష ఎంత అన్నదానిపైనే ఉంది. ప్రాసిక్యూషన్ మాత్రం జీవిత ఖైదు విధించాలని కోరుతోంది.
