Shapoor Zadran: క్రికెట్ ప్రపంచంలో విషాదం.. ఐసీయూలో చేరిన స్టార్ బౌలర్!

Shapoor Zadran

Shapoor Zadran

Shapoor Zadran: ఒకప్పుడు తన నిప్పులు చెరిగే బంతులతో ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌లను వణికించిన అఫ్ఘానిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ (38) ప్రస్తుతం చావుతో పోరాడుతున్నారు. తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. వైద్య నివేదికల ప్రకారం.. జద్రాన్ శరీరంలో తెల్ల రక్త కణాల (WBC) సంఖ్య గణనీయంగా పడిపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని తెలుస్తోంది. వైద్యులు ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

READ ALSO: PM Modi: ఇవాళ రాత్రి 8.30కి.. జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ..

కలవరపెడుతున్న ఫోటోలు..
పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జద్రాన్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. జద్రాన్ తనకు మంచి మిత్రుడని, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సైతం జద్రాన్ సోదరుడితో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జద్రాన్ కుటుంబ సభ్యులు కూడా సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను పంచుకుంటూ, ఆయన కోలుకోవాలని అభిమానులను కోరుతున్నారు.

ఒక వెలుగు వెలిగిన కెరీర్..
నిజానికి అఫ్ఘానిస్థాన్ క్రికెట్ ఎదుగుదలలో షాపూర్ జద్రాన్ పాత్ర మరువలేనిది. 2009లో నెదర్లాండ్స్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన జద్రాన్.. తన కెరీర్‌లో 44 వన్డేలు (44 వికెట్లు), 36 టీ20లు (27 వికెట్లు) ఆడి మొత్తం 80 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించారు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ వంటి మేటి బ్యాటర్లను తన స్వింగ్ వేగంతో పెవిలియన్ పంపిన రికార్డు ఆయన సొంతం. గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ స్టార్ బౌలర్, అనారోగ్యం నుంచి కోలుకుని మళ్లీ క్షేమంగా తిరిగిరావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ప్రార్థిస్తున్నారు.

READ ALSO: Tech Layoffs 2026: మీరు ఐటీ ఉద్యోగులా? అయితే ఈ రిపోర్ట్ చదవాల్సిందే.. 5 ఏళ్లలో 10 లక్షల మంది ఇంటికి!