Secunderabad Bonalu 2026: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఆషాఢ బోనాల జాతర మహోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ ఏడాది (2026) నిర్వహించబోయే వార్షిక బోనాల జాతర కార్యక్రమాల అధికారిక షెడ్యూల్ వివరాలను ఆలయ చైర్మన్, అర్చక బృందం కలిసి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కి అందజేశారు. జాతరను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు వీలుగా ముందస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు ఈ వివరాలను మంత్రికి సమర్పించారు.
ఆలయ దేవస్థానం ప్రకటించిన అధికారిక షెడ్యూల్ ప్రకారం.. జూలై 19వ తేదీ (ఆదివారం) సాయంత్రం 4:00 గంటలకు అమ్మవారి ఘటోత్సవం (ఎదురుకోలు) కార్యక్రమంతో ఈ మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. అనంతరం, జాతరలో అత్యంత కీలకమైన ప్రధాన బోనాల ఉత్సవాన్ని ఆగస్టు 2వ తేదీ (ఆదివారం) తెల్లవారుజామున 4:00 గంటల నుంచే ప్రారంభించనున్నారు. ఆ రోజంతా లక్షలాది మంది మహిళలు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోనున్నారు. జాతర మరుసటి రోజైన ఆగస్టు 3వ తేదీ (సోమవారం) ఉదయం 8:30 గంటలకు భవిష్యవాణిని వినిపించే ప్రసిద్ధ రంగం కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత ఉదయం 10:30 గంటల సమయంలో అత్యంత కోలాహలంగా అమ్మవారి గజవాహన ఊరేగింపు మహోత్సవాన్ని నిర్వహించనున్నారు.

