NTV Telugu Site icon

Team India U19: అండర్-19 మహిళా టీమ్‌కు ఘన సత్కారం..సచిన్‌ ప్రశంసలు

Team

Team

అండర్-19 టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత మహిళా జట్టుకు ఘన సత్కారం జరిగింది. బీసీసీఐ ఆధ్వర్యంలో లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ఆటగాళ్లను సన్మానించారు. అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియం వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టీ20కి ముందు అండర్-19 ప్లేయర్లను సత్కరించారు. ఈ క్రమంలోనే బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, సెక్రటరీ జైషా, క్రికెటర్ సచిన్ అండర్-19 టీమ్‌కు రూ.5 కోట్ల చెక్‌ను అందజేశారు. అనంతరం వారిని ఉద్దేశించి సచిన్ మాట్లాడుతూ.. మహిళా ప్లేయర్ల పెర్ఫామెన్స్ ఎందరికో స్ఫూర్తి నింపిందని కొనియాడాడు.

ఇటీవల జరిగిన అండర్ 19 వుమెన్స్ వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు విశ్వవిజేతగా మారిన సంగతి తెలిసిందే. ఆదివారం నాడు ఇంగ్లాండ్ విమెన్స్ టీమ్‌తో జరిగిన ఫైనల్‌లో సులభంగా గెలిచిన భారత అమ్మాయిలు.. ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్నారు. ఫలితంగా భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఓ ఐసీసీ ట్రోఫీని తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో వీరిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.షెఫాలీ వర్మ కెప్టెన్సీలో భారత అండర్ 19 జట్టు ఫైనల్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 17.1 ఓవర్లో కేవలం 68 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు టైటాస్ సధు, అర్చనా దేవి, ప్రశవి చోప్రా ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. అనంతరం లక్ష్య ఛేదనంలో భారత అమ్మాయిలు 3 వికెట్లు కోల్పోయి 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. సౌమ్యా తివారీ(24), గొంగడి త్రిష(24) ఆకట్టుకునే ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించారు.