South Africa vs India Prediction and Playing 11: మూడు వన్డే సిరీస్‌లో భాగంగా నేడు దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో అదరగొట్టిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు సొంతగడ్డపై అనూహ్యంగా 116 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా పుంజుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. గబెరాలోని సెయింట్ జార్జ్ పార్క్ మైదానంలో ఈ మ్యాచ్ సాయంత్రం 4.30 నుంచి ఆరంభం కానుంది.
టెస్టు సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ జట్టును వీడాడు. దాంతో శ్రేయస్ స్థానంలో ఎవరు ఆడతారన్నది ఆసక్తికరంగా మారింది. ఫినిషర్ రింకు సింగ్ లేదా రజత్ పటీదార్‌లలో ఒకరికి రెండో వన్డేలో అవకాశం దక్కనుంది. టీ20ల్లో ఫినిషర్ పాత్రలో రింకు ఆకట్టుకున్నా.. అతడు ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఆ స్థానంలో సంజు శాంసన్ ఇప్పటికే తుది జట్టులో ఉన్నాడు. పటీదార్ దేశావాళీల్లో నాలుగో స్థానంలో అద్భుత ప్రదర్శన చేశాడు. దాంతో శ్రేయస్ స్థానంలో పటీదార్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశాలే ఎక్కువ. అరంగేట్ర వన్డేలో అర్ధ సెంచరీతో సత్తా చాటిన యువ ఓపెనర్ సాయి సుదర్శన్‌కు మరో అవకాశం లభించనుంది. రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ అందుకోవాల్సి ఉంది.
బౌలింగ్ విభాగంలో భారత్ మార్పు చేర్పులు చేయకపోవచ్చు. తొలి వన్డేలో చెలరేగిన పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్‌లపై భారీ అంచనాలు ఉన్నాయి. మరో పేసర్ ముకేశ్ కుమార్ గాడిలో పడాల్సిన అవసరముంది. ఒకవేళ ప్రయోగం చేయాలనుకుంటే.. ముకేశ్ స్థానంలో ఆకాశ్ దీప్ జట్టులోకి వస్తాడు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఆడడం ఖాయం. మరోవైపు తొలి వన్డేలో బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైన దక్షిణాఫ్రికా రెండో వన్డేలో పుంజుకోవాలని చూస్తోంది. క్వింటాన్ డికాక్ వీడ్కోలు పలికిన నేపథ్యంలో డసెన్, క్లాసెన్, మిల్లర్‌లపై భారం పడింది. తొలి వన్డేలో సీనియర్లంతా విఫలం కావడం సఫారీలకు ఆందోళన కలిగిస్తోంది.
గబెరాలో నేడు వాతావరణం పొడిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సెయింట్ జార్జ్ పార్క్ మైదానంలో పిచ్ మందకొడిగా ఉంటుంది. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం లేదు. ఇక్కడ స్పిన్నర్లు కీలకం అవుతారు. గత 12 ఏళ్లలో ఇక్కడ 8 వన్డేలు జరగ్గా.. ఒక్కసారి కూడా 300 స్కోరు దాటలేదు. మ్యాచ్‌కు వర్షసూచన లేదు.
జట్లు (అంచనా):
భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్, సాయి సుదర్శన్, రజత్ పటీదార్, తిలక్‌వర్మ, శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, కుల్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్.
దక్షిణాఫ్రికా: మార్‌క్రమ్ (కెప్టెన్), హెండ్రిక్స్, టోనీ జార్జీ, వాండర్ డసెన్, క్లాసెన్, మిల్లర్, ఫెలుక్వాయో, ముల్దర్, బర్గర్, కేశవ్ మహరాజ్, షంసి.