NTV Telugu Site icon

INDvsAUS 1st Test: ముగిసిన తొలిరోజు ఆట.. టీమిండియా 77/1

Rerrr

Rerrr

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ అదరగొడుతోంది. ముందుగా ఆస్ట్రేలియాను తక్కువ రన్స్‌కే ఆలౌట్ చేసిన టీమిండియా.. బ్యాటింగ్‌లోనూ రాణిస్తోంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టును టీమిండియా స్పిన్నర్లు ముప్పతిప్పలు పెట్టారు. గాయం కారణంగా కొద్దినెలలుగా ఆటకు దూరమైన రవీంద్ర జడేజా రీఎంట్రీ ఇచ్చిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే ఐదు వికెట్లతో రాణించడంతో ఆసీస్ 177 రన్స్‌కే ఆలౌటైంది. లబుషేన్ (49) కొద్దిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకోగా.. స్మిత్ (37), అలెక్స్ కారే (36), హ్యాండ్స్‌కాంబ్ (31) కాసేపు పోరాడారు. అశ్విన్ 3, షమీ, సిరాజ్ చెరో వికెట్‌తో ఆకట్టుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా అదరగొట్టింది.

రోహిత్ ఆన్ ఫైర్

నాగ్‌పూర్ పిచ్‌పై టీమిండియా స్పిన్నర్లు రాణించడంతో భారత బ్యాటర్లు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉందని విశ్లేషించారు. కానీ దానికి భిన్నంగా కెప్టెన్ రోహిత్ మొదటి నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌలర్ ఎవ్వరైనా వదలకుండా టెస్టుల్లో టీ20 మ్యాచ్‌ ఆడేశాడు. ఫోర్లు, సిక్స్‌లతోనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇతడికి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ సపోర్ట్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే రోహిత్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే రాహుల్ (20) ఔట్ కావడంతో రవి అశ్విన్ నైట్ వాచ్‌మన్‌గా మైదానంలోకి వచ్చాడు. కాగా, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఒక వికెట్ నష్టపోయి 77 రన్స్ చేసింది. రోహిత్ (56 నాటౌట్), అశ్విన్ (0 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఇంకా 100 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Show comments