NTV Telugu Site icon

SLBC Tunnel Collapse: 144 గంటలుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్!

Slbc Tunnel Collapse

Slbc Tunnel Collapse

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పైకప్పు కూలిన ఘటనలో చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 144 గంటలుగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారంతో పోల్చితే.. గురువారం సహాయ చర్యల్లో వేగం పుంజుకుంది. టన్నెల్‌లో కూరుకుపోయిన టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం)ను ప్లాస్మా కట్టర్లతో రెస్క్యూ టీమ్ ముక్కలుగా కత్తిరింస్తోంది. మిషన్‌పై భారీగా ఉన్న బురద, మట్టి, రాళ్లను తొలగిస్తూనే యంత్రాన్ని ముక్కలుగా కోస్తున్నారు. సిల్ట్, మట్టిని లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. 12వ కిలోమీటరు నుంచి టన్నెల్‌లోని బురద, నీళ్లు, రాళ్లు, వ్యర్థాలను సైతం తొలగిస్తున్నారు.

మట్టిలో కార్మికుల ఆనవాళ్ల కోసం రాడార్‌లతో సెర్చ్ చేస్తున్నారు. జీపీఆర్ యంత్రం రేడియో తరంగాలతో శిధిలాలను జల్లెడ పడుతుతోంది. కాన్వెర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు కూడా కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో శ్రమిస్తున్న రెస్క్యూ బృందాలకు భూ ఉపరితలం నుంచి ఎటువంటి సాయం చేయవచ్చనే కోణంలోనూ అన్వేషణ జరుగుతోంది. శుక్రవారం కూడా రెస్క్యూ ఆపరేషన్లో మరింత వేగం పుంజుకోనుంది. బీఆర్‌వో, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, నేవీ, ఆర్మీ, సింగరేణి, ర్యాట్‌ హోల్‌ మైనర్స్, హైడ్రా, పలు ప్రైవేటు నిర్మాణ సంస్థలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. రైల్వేశాఖ సైతం నిన్న ఓ బృందాన్ని పంపించింది. శుక్రవారం రెండో బృందం వెళ్లనుంది.