Raw Mango Tomato Roti Pachadi Recipe: వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కమ్మగా ఉండే పచ్చడి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది రోటి పచ్చడే. సాధారణంగా కూరగాయలతో చేసే ఈ పచ్చడిని, పచ్చి మామిడికాయతో కూడా అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. మామిడికాయ పులుపు, టమాటా కాసింత తీపి కలిసిపోతే వచ్చే రుచి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ మామిడికాయ టమాటా రోటి పచ్చడి అన్నంలోకే కాదు, చపాతీ, టిఫిన్స్‌తో కూడా చాలా బాగుంటుంది. మరి ఈ సింపుల్ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దామా..
అవసరమైన పదార్థాలు:
* పచ్చి మామిడికాయ – 1 చిన్నది (పులుపు ఎక్కువైతే సగం)
* టమాటాలు – 4
* పచ్చిమిర్చి – 10
* వెల్లుల్లి రెబ్బలు – 10
* మెంతులు – 1/4 టీ స్పూన్
* జీలకర్ర – 1/2 టీ స్పూన్
* ధనియాలు – 1 టీ స్పూన్
* ఆవాలు – 1/2 టీ స్పూన్
* ఎండుమిర్చి – 7
* నువ్వులు – 1 టేబుల్ స్పూన్
* ఉప్పు – తగినంత
* నూనె – 1 టేబుల్ స్పూన్
* ఉల్లిపాయ – 1 చిన్నది
* కొత్తిమీర – ఒక గుప్పెడు
* తాలింపు కోసం – ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ.
తయారీ విధానం:
మామిడికాయ, టమాటాల సిద్ధం:
మొదట పచ్చి మామిడికాయను శుభ్రంగా కడిగి, పై పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటాలను కూడా పెద్ద ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
మసాలా దినుసులు రోస్ట్:
స్టవ్‌పై పాన్ పెట్టి అందులో మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు వేసి స్వల్పంగా వేయించాలి. తర్వాత ఎండుమిర్చి, నువ్వులు వేసి లైట్ గా రోస్ట్ చేసి మిక్సీ జార్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
కూరగాయలు మగ్గించడం:
అదే పాన్‌లో నూనె వేసి వేడి అయ్యాక పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి కొద్దిగా వేయించాలి. తర్వాత టమాటా, మామిడికాయ ముక్కలు వేసి మూత పెట్టి మధ్యమ మంటపై మెత్తగా మగ్గే వరకు ఉంచాలి. మధ్య మధ్యలో కలపడం మర్చిపోవద్దు.
గ్రైండింగ్:
మొదట రోస్ట్ చేసిన దినుసులను మెత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత మగ్గిన టమాటా, మామిడికాయ మిశ్రమాన్ని, ఉప్పు వేసి పూర్తిగా పేస్ట్ కాకుండా కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేయాలి. ఫైనల్ గా మిక్సీ జార్‌లో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి కొద్దిగా కోర్స్‌గా గ్రైండ్ చేసి పచ్చడిలో కలపాలి.
తాలింపు:
ఇష్టమైతే తాలింపు వేయించి పచ్చడిలో కలిపితే రుచి మరింత పెరుగుతుంది. ఈ మామిడికాయ టమాటా రోటి పచ్చడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇడ్లీ, దోస, చపాతీతో కూడా చాలా రుచిగా ఉంటుంది. ప్రత్యేకంగా వేరే కూర అవసరం లేకుండా ఈ పచ్చడితోనే తినేయొచ్చు.
