NTV Telugu Site icon

Rahul Gandhi: బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోంది.. జనజాతర సభలో రాహుల్

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: తుక్కుగూడ జనజాతర సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ బీజేపీపై విరుచుకుపడడంతో పాటు మేనిఫెస్టోలోని కీలక వాగ్దానాలను ప్రకటించారు.  కొన్ని రోజుల కిందే తెలంగాణకు సంబంధించిన మేనిఫెస్టోను ఇక్కడ రిలీజ్ చేశానని  తుక్కుగూడ జనజాతర సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. తెలంగాణలో హామీలు నెరవేర్చినట్లే.. జాతీయ స్థాయిలో కూడా మాటలు నిలబెట్టుకుంటామన్నారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చామన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్న ఆయన.. ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టామన్నారు. దేశ ప్రజల మనసులోని మాటే మే మేనిఫెస్టో అని రాహుల్ గాంధీ తెలియజేశారు. ఐదు న్యాయ సూత్రాలు భారతీయ ఆత్మ అని ఆయన వెల్లడించారు. మోడీ అధికారంలోకి వచ్చాక దేశంలో ప్రజలు నిరుపేదలయ్యారని రాహుల్ పేర్కొన్నారు.

మరో 50 వేల ఉద్యోగాలు..
యువతకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టబోతున్నామని.. ఏడాది పాటు యువతకు ట్రైనింగ్ గ్యారెంటీ ఇస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో 30 వేల ఉద్యోగాలిచ్చామని.. మరో 50 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని రాహుల్ ప్రకటించారు. మహిళల కోసం నారీ న్యాయ్ చట్టం తీసుకొస్తామని చెప్పారు. నారీ న్యాయ్‌తో ప్రతీ పేద మహిళకు రూ.లక్ష సాయం అందిస్తామన్నారు. నారీ న్యాయ్‌తో దేశ ముఖ చిత్రం మారబోతోందన్నారు. మహిళా అకౌంట్లలోకి నేరుగా రూ. లక్ష జమ చేస్తామన్నారు. పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. స్వామినాథన్ ఫార్ములా ప్రకారం మద్దతు ధర ఇస్తామని ప్రకటించారు. భవిష్యత్‌లో రూ.లక్షకు తక్కువ ఆదాయం ఉన్న కుటుంబం ఉండదన్నారు. దేశంలో నిత్యం 30 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. ధనవంతులకు మోడీ రూ.16 లక్షల కోట్లు మాఫీ చేశారని.. రైతులకు మాత్రం మోడీ రూపాయి రుణం కూడా మాఫీ చేయలేదని విమర్శలు గుప్పించారు. మేం అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. కార్మికులకు పనికి తగిన వేతనం దక్కేలా చూస్తామన్నారు. కార్మికులకు కనీస వేతనం అందేలా చూస్తామన్నారు. దేశంలో 50 శాతం వెనుకబడిన వర్గాల వారేనని ఆయన చెప్పారు.

ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్స్
గతంలో ఉన్న సీఎం ఎలా ప్రభుత్వాన్ని నడిపించారో మీకు తెలుసని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వేల మంది ఫోన్లను కేసీఆర్ ట్యాపింగ్ చేయించాడని రాహుల్ మండిపడ్డారు. ఇంటెలిజెన్స్ , పోలీసు వ్యవస్థను కేసీఆర్‌ దుర్వినియోగం చేశారని విమర్శించారు. ప్రభుత్వం మారగానే డేటా మొత్తం ధ్వంసం చేశారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పని మొదలుపెట్టిందని.. నిజం మీ ముందు ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ ఏం చేశారో ఢిల్లీలో మోడీ ప్రభుత్వం కూడా అదే చేస్తోందన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎక్స్‌టార్షన్‌ డైరెక్టరేట్‌గా మారిందన్నారు. బీజేపీ అతిపెద్ద వాషింగ్ మెషిన్ నడిపిస్తోందన్న రాహుల్.. ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్స్ అని తెలిపారు. ఒక రోజు సీబీఐ కంపెనీకి ఝలక్ ఇస్తుంది.. అదే నెలలో ఆ సంస్థ ఎలక్టోరల్ బాండ్స్‌ కొనుగోలు చేస్తుందన్నారు. బీజేపీకి డబ్బు ఇచ్చిన కంపెనీలకు వేలకోట్ల ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు దక్కేవన్నారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్‌ చేశారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ బీ టీమ్‌ను ఓడించామని.. ఇప్పుడు దేశంలో బీజేపీని కూడా ఓడించబోతున్నామన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోందని.. మేము రాజ్యాంగాన్ని రద్దు చేయమన్నారు.

బీజేపీ దగ్గర డబ్బుందని.. మా దగ్గర మీ ప్రేమ మాత్రమే ఉందన్నారు. మేనిఫెస్టోలో అందరికి సరైన న్యాయం చేశామన్నారు. రైతులు వెనుకబడినవారికి మరో ఐదు హామీలున్నాయన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ మేనిఫెస్టో దేశ ముఖచిత్రాన్ని మార్చబోతోందని ఆయన స్పష్టం చేశారు.