CWG 2026: కామన్వెల్త్‌లో ఇండియాకు మరో స్వర్ణ పతకం.. బాక్సింగ్ విభాగంలో పవర్ చూపించిన ‘ప్రీతి పవార్’..

Preethi

Preethi

2026 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సింగ్ స్టార్ ప్రీతి పవార్ ఘన విజయం సాధించి దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. మహిళల 54 కేజీల బ్యాంకమ్‌వెయిట్ కేటగిరీ ఫైనల్‌లో కెనడాకు చెందిన స్కార్లెట్ సవన్నాపై 5-0తో ఏకగ్రీవ నిర్ణయంతో ఘనవిజయం సాధించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. 22 ఏళ్ల ప్రీతి రింగ్‌లో మొదటి రౌండ్ నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కచ్చితమైన పంచ్‌లు విసురుతూ, వేగవంతమైన ఫుట్‌వర్క్‌తో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. తొలి రౌండ్‌లోనే ఐదుగురు జడ్జిల నుంచి 10-8తో ఆధిపత్యం సాధించిన ఆమె, చివరి వరకు అదే జోరును కొనసాగించి ఏకపక్ష విజయాన్ని అందుకుంది.

ఈ టోర్నీలో ఒక్క రౌండ్ కూడా ఓడిపోకుండా ప్రీతి ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. తొలి రౌండ్‌లో స్కాట్లాండ్‌కు చెందిన నియామ్ హ్యూస్టన్‌ను, క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన టీనా రహీమీని ఓడించిన ఆమె, సెమీఫైనల్‌లో జాంబియా బాక్సర్ కేథరిన్ మ్వాపేపై 5-0తో విజయం సాధించి గోల్డ్ మెడల్ బౌట్‌కు అర్హత సాధించింది. ప్రపంచ బ్యాంకమ్‌వెయిట్ ర్యాంకింగ్స్‌లో 3వ స్థానంలో ఉన్న ప్రీతి తన అద్భుత ఫామ్‌ను నిలబెట్టుకుంటూ విజేతగా నిలిచింది.

ప్రీతి పవార్ అంతర్జాతీయ వేదికలపై వరుస విజయాలతో భారత బాక్సింగ్‌లో కీలక శక్తిగా మారింది. ఆమె 2026 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లోనూ, 2025 వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్‌లోనూ స్వర్ణ పతకాలు సాధించింది. అలాగే 2023 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలుచుకోవడంతో పాటు 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. అంతకుముందు 2022 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2024 ఆసియా U-22 ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకాన్ని కైవసం చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ కామన్వెల్త్ స్వర్ణంతో తన విజయాల పరంపరను మరోమెట్టు పైకి తీసుకెళ్లింది.