A Car Destroying Traffic Barricades at Praja Bhavan: బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద కారు బీభత్సం సృష్టించిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం (డిసెంబర్ 23) తెల్లవారుజామున 3 గంటల సమయంలో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన కారు (టీఎస్ 13 ఈటీ 0777) ప్రజాభవన్ ఎదుట ఉన్న ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం కాగా.. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఆ రోజు డ్యూటీలో ఉన్న ఇన్‌స్పెక్టర్ యువతీయువకులకు ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించేందుకు హోంగార్డును ఇచ్చి పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు పంపారు. నిర్లక్ష్యంగా కారు నడిపిన అబ్దుల్ ఆసిఫ్ (27)పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసిఫ్ మద్యం తాగలేదని పోలీసులు తేల్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఓ యువకుడు పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయాడట. ఆ యువకుడు స్వతహాగా తప్పించుకున్నాడా? లేదా పోలీసుల సాయంతో పారిపోయాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Gold Rate Today: స్థిరంగా బంగారం ధరలు.. పెరిగిన వెండి!
ప్రమాద సమయంలో బోధన్ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కుమారుడు కారు నడిపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసు నమోదు సమయంలో పోలీసులు అసలు నిందితుడిని తప్పించి.. మరొకరిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. మరోవైపు డ్రైవింగ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం ట్రాఫిక్ పోలీసులకు అప్పగించినట్టు పంజాగుట్ట పోలీసులు చెబుతున్నారు. దీంతో విషయాన్ని డీసీపీ దృష్టికి తీసుకెళ్లగా.. ఎస్‌ఆర్‌నగర్ డివిజన్ ఏసీపీ వైవీరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.