Earthquake in Peru: దక్షిణ అమెరికా దేశం పెరూలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో భూమి కంపించింది. రాజధాని లిమాతో పాటు పలు ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు తీవ్రంగా కనిపించాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. లిమాలోని పార్లమెంట్ భవనాన్ని కూడా అధికారులు ఖాళీ చేయించారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు.
జర్మనీకి చెందిన జియోసైన్సెస్ రీసెర్చ్ సెంటర్ (GFZ) ఈ భూకంప తీవ్రతను 6.8గా నమోదు చేసింది. పెరూ జియోఫిజికల్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం.. దేశంలోని మధ్య ప్రాంతంలో ఉన్న ఆండీస్ పర్వత ప్రాంతంలోని జునిన్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూమికి సుమారు 129 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మరోవైపు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) భూకంప తీవ్రత 6.9గా వెల్లడించింది. జునిన్‌కు ఉత్తరంగా 34 కిలోమీటర్ల దూరంలో, భూమికి 108 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది.
భూకంప ప్రకంపనలు రాజధాని లిమా వరకు వ్యాపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలో ఉన్నవారు వెంటనే బయటకు వచ్చి రోడ్లపైకి చేరుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పార్లమెంట్ భవనంలోని ఎంపీలు, ఇతర సిబ్బంది కూడా భద్రతా కారణాలతో బయటకు వెళ్లిపోయారు. అయితే భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
భూకంపం సంభవించిన జునిన్ ప్రాంతం రాగి గనులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడే పెరూలోని అతిపెద్ద రాగి గనుల్లో ఒకటైన టోర్మోచో గని కూడా ఉంది. ప్రపంచంలో రాగి ఉత్పత్తి చేసే దేశాల్లో పెరూ మూడో స్థానంలో ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థలో మైనింగ్ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. భూకంపం నేపథ్యంలో అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకంపనల కారణంగా సునామీ వచ్చే ప్రమాదం లేదని స్పష్టం చేసింది. పెరూ పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఉన్న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో భాగంగా ఉంది. సుమారు 40 వేల కిలోమీటర్ల పొడవున విస్తరించిన ఈ ప్రాంతంలో అనేక అగ్నిపర్వతాలు, భూమి లోపలి టెక్టానిక్ ప్లేట్ల సరిహద్దులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంభవించే భూకంపాల్లో అధిక శాతం ఈ ప్రాంతంలోనే చోటుచేసుకుంటాయి.
A powerful earthquake in central Peru has triggered a landslide along Lima’s Costa Verde.
Footage shows rocks and earth tumbling from the coastal cliffs onto the roadway, creating hazardous conditions for motorists.
The magnitude 6.7 earthquake struck the Junín region on Friday evening and was felt in Lima, prompting residents to evacuate buildings.
No immediate casualties have been reported. https://t.co/LTvdE1kN2g
— Ghauri | Nature, Weather, News. (@Integral_IG) November 21, 2026

