NTV Telugu Site icon

Chilkur Balaji Temple Priest: అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసు.. మరో ఏడుగురి అరెస్ట్

Chilkur Balaji Temple Priest

Chilkur Balaji Temple Priest

చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ దాడి కేసులో మరో ఏడుగురిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, భద్రాచలంకు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన విషయం తెలిసిందే. మొత్తం 18 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు.

READ MORE: Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

కాగా.. చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధానార్చకులు సీఎస్‌ రంగరాజన్‌పై దాడి కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డి సహా 11 మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డిపై అబిడ్స్, బంజారాహిల్స్, గోల్కొండ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 7న 20 మంది నిందితులు (మహిళలు, పురుషులు) సీఎస్‌ రంగరాజన్ ఇంటికి వెళ్లారు. రామదండు కోసం మనుషులను రిక్రూట్ చేయాలని, అలానే ఆర్ధిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. రంగరాజన్ అందుకు వ్యతిరేకించినందుకు మొహం, శరీరంపై దాడికి పాల్పడ్డారు. మణికొండ పంచవటి కాలనీలో ఈనెల 8న వీర రాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో చేసిన నేరాన్ని రాఘవ రెడ్డి ఒప్పుకున్నాడు. దాడికి ముందు ఏ2గా ఉన్న నిందితుడు సాయన్నను దమ్మాయిగూడలోని ఉదా రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో కలుసుకున్నారు.

READ MORE: Mstan Sai Case: మస్తాన్ సాయి కేసులో పోలీసులు కీలక పరిణామం..

రాఘవ రెడ్డి 2014లో ఆంధ్ర అసోసియేషన్ ఫర్ తెలంగాణ, ఆంధ్ర పీపుల్ పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేశాడు. హిందూ ధర్మాన్ని కాపాడతానని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ప్రత్యేక ఫోర్స్ ను సిద్దం చేయాని భావించాడు. ఇందు కోసం ఫేస్‌ బుక్, యూట్యూబ్ ఛానెళ్ళు ఏర్పాటు చేసి ప్రసంగాలు ఇచ్చి ప్రేరేపించాడు. రాఘవ రెడ్డి మణికొండలో నూతన న్యాయ చట్టాలపై అవగాహన కోసం సమావేశం ఏర్పాటు చేశాడు. 2022లో భార్యను చైర్మన్ గా పెట్టి కోసలేంద్ర ట్రస్ట్ ప్రారంభించాడు. దీని ద్వారా ఫండ్ కలెక్ట్ చేశాడు. ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన శ్యామ్ అనే వ్యక్తి సాయంతో రామరాజ్యం వెబ్ సైట్ ను ప్రారంభించాడు. 10 నెలల క్రితం రాఘవ రెడ్డి ఓ యూట్యూబ్ ఫాలోవర్ ద్వారా జనవరి 25న రంగారాజన్ ను కలిశాడు. అతను చెప్పి ప్రతిపాదనకు రంగరాజన్ స్పందించలేదు. నిందితులు గత నెల 25న పెనుగొండలోని వాసవి కన్యాకాపరమేశ్వరి గుడిలో కలుసుకున్నారు. ఈ నెల 4న రాఘవ రెడ్డి స్నేహితుడు, న్యాయవాది అయిన దామోదర్ రెడ్డి సాయంతో దమ్మాయిగూడలో ఉదా రెడ్డి ఇంట్లో కలుసుకున్నారు. రంగరాజన్ ను మరోసారి కలిసి మాట్లాడాలని, వినకుంటే దాడి చేయాలని నిర్ణయించుకున్నారు.