PNG Cricketer Kiplin Doriga Arrested in Robbery Case: పపువా న్యూగినియా (పీఎన్‌జీ) క్రికెటర్ కిప్లింగ్ డోరిగాపై చోరీ కేసు నమోదైంది. పోలీసులు అరెస్ట్ చేసి.. మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచగా అతడు తన నేరాన్ని అంగీకరించాడు. కోర్టు డోరిగా బెయిల్‌ను తిరస్కరించింది. దాంతో అతడు నవంబర్ 28 వరకు పోలీసుల కస్టడీలో ఉండనున్నాడు. కోర్టు తదుపరి విచారణను నవంబర్ 28కి వాయిదా వేసింది. రిలీఫ్ మేజిస్ట్రేట్ రెబెక్కా మోర్లీ-కిర్క్ ఈ కేసును అత్యంత తీవ్రమైందిగా పరిగణించి.. రాయల్ కోర్టుకు బదిలీ చేశారు.
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం… జెర్సీ ద్వీపంలో జరిగిన ఐసీసీ సీడబ్ల్యూసీ ఛాలెంజ్ లీగ్ టోర్నమెంట్ సందర్భంగా పీఎన్‌జీ వికెట్ కీపర్ అయిన కిప్లింగ్ డోరిగాపై దోపిడీ అభియోగం మోపబడింది. ఈ సంఘటన ఆగస్టు 25 ఉదయం సెయింట్ హెలియర్స్‌లో జరిగినట్లు తెలుస్తోంది. దొంగతనం చేస్తూ డోరిగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడట. ఈ విషయం క్రికెట్ ప్రపంచాన్ని భారీ షాక్‌కు గురి చేస్తుంది. డోరిగా గల్లీ క్రికెటర్, జాతీయ స్థాయి క్రికెటర్ కాదు.. అతడు రెండు ప్రపంచకప్‌లు, 97 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఘటన పపువా న్యూగినియా క్రికెట్ బోర్డును అప్రతిష్ఠ పాలు చేసింది.
Also Read: Auqib Nabi: ఆకిబ్ నబీ సంచలన బౌలింగ్.. దులీప్ ట్రోఫీ చరిత్రలో ఇదే మొదటిసారి!
29 ఏళ్ల కిప్లింగ్ డోరిగా 2021, 2024లో పీఎన్‌జీ తరఫున టీ20 ప్రపంచకప్ ఆడాడు. ఈ రెండు టోర్నీలలో ఏడు మ్యాచ్‌లలో ఆడాడు. మొత్తంగా 97 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. పీఎన్‌జీ తరఫున 39 వన్డేలు, 43 టీ20లు ఆడాడు. రెండు ఫార్మాట్లలో 1000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. 2025 సీడబ్ల్యూసీ ఛాలెంజ్ లీగ్‌లో రెండు మ్యాచ్‌లలో డోరిగా ఆడాడు. డెన్మార్క్‌పై 84 బంతుల్లో 68 పరుగులు, కువైట్‌తో జరిగిన తదుపరి మ్యాచ్‌లో 29 బంతుల్లో 12 పరుగులు చేశాడు. అయితే ఈ రెండు మ్యాచ్‌లలో పీఎన్‌జీ ఓడిపోయింది. మరి నేరం ఒప్పుకున్న డోరిగాకు ఎలాంటి శిక్ష పడుతుందో చూడాలి.
